తోడొకరుండిన  అదే భాగ్యమూ.. ఆరోగ్యమూ..

31 Jul, 2022 08:08 IST|Sakshi

ప్రభుత్వోద్యోగిగా రిటైరైన ఎఎస్‌రావు నగర్‌ వాసి ప్రహ్లాదరావు, కొన్నాళ్ల క్రితం భార్యను కోల్పోయారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం దెబ్బతిని డయాబెటిస్, బీపీ వగైరాలు చుట్టుముట్టాయి. ఇటీవల ఆయన తన వయసుకు తగ్గ తోడును వెదుక్కుని మళ్లీ ఓ జంటవారయ్యారు. కొన్ని నెలల్లోనే ఆయన ఆరోగ్య సమస్యలూ నియంత్రణలోకి వచ్చాయి.  

పిల్లలంతా వేర్వేరు చోట్ల స్థిరపడిపోవడంతో ఒంటరిగా ఉంటున్న శైలజ (55) ఇటీవలే తనలాగే ఒంటరిగా ఉంటున్న స్నేహితుడితో కలిసి జీవించడం ప్రారంభించారు. విచిత్రంగా ఆమెను  వేధించిన డిప్రెషన్, నిద్రలేమి తదితర సమస్యలన్నీ మాయమయ్యాయి. ‘ఏ వయసులోనైనా తోడు అనేది ఒక తప్పనిసరి. అది మనిషిని మానసికంగా సేదతీర్చి అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్సలా పనిచేస్తుంది’ అని నగరానికి చెందిన ఫిజిషియన్‌ డా.శంకర్‌ చెప్పారు.  

సాక్షి, హైదరాబాద్‌ :  ఒంటరి జీవితం ఏ వయసులోనైనా దుర్భరమే అయినప్పటికీ.. మరే రకమైన వ్యాపకం లేని వృద్ధులకు అది మరింత తీవ్రమైన సమస్యగా మారుతుంది. ఈ పరిస్థితిలోనే  అనేక రకాల శారీరక, మానసిక అనారోగ్యాలకు వారు గురవుతారు. అప్పటిదాకా లేని జబ్బులు వారిని చుట్టుముడతాయి. ‘‘మానసిక వేదన, నిరాశా నిస్పృహలు, తాము అప్ర«దాన వ్యక్తులుగా మారామనే భావన...రోగ నిరోధకశక్తిని తీవ్రంగా దెబ్బతీస్తాయి. దాగి ఉన్న వ్యాధులు విజృంభించేలా చేస్తాయి’’ అని సైకాలజిస్ట్‌ ప్రవీణ్‌ చెప్పారు  

నిద్రలేమి, బీపీ తగ్గాయి.. 
ఒంటరిగా ఉన్నప్పుడు రక్తపోటు, చక్కెర వ్యాధి, నిద్రలేమి వంటి సమస్యలు వేధించేవి. నిత్యం మందులు వాడాల్సి వచ్చేది. ఈ పరిస్థితిలో టైమ్‌కి మందులవీ ఇచ్చి నా బాగోగులు చూసుకునేందుకు ఒకరు ఉంటే బాగుండని రాజేశ్వరిని పెళ్లి చేసుకుంటే... తనే నా పాలిట మెడిసిన్‌గా మారింది. ఇప్పుడు నిద్రలేమి పోయింది.. మందుల అవసరం తగ్గిపోయింది.    
 –కోటేశ్వరరావు 

ఆ‘పరేషాన్‌’ తీరింది... 
వ్యక్తిగతంగా నేనూ 60ఏళ్ల వయసులో పునర్వివాహం చేసుకున్నాను. ఆ పెళ్లి నాతో పాటు నా భర్త ఆరోగ్యాన్ని కూడా చాలా మెరుగయ్యేలా చేసింది. తోడు నీడ స్థాపించడానికి అదో కారణం. మా సంస్థ ద్వారా కొన్ని వందల మంది సీనియర్‌ సిటిజన్స్‌ని పెళ్లిళ్లు/లివిన్‌ రిలేషన్‌ షిప్స్‌ ల ద్వారా జంటలుగా మార్చాం. అది అనేకమందికి అప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలకు  పరిష్కారం చూపింది. ఒంటరిగా ఉన్న ఓ పెద్దావిడ ఎప్పటి నుంచో వాయిదా వేస్తూ వచ్చిన మోకాలి చిప్ప ఆపరేషన్‌ ను పెళ్లయిన వెంటనే చేయించుకోగలిగారనేది దానికో చిన్న ఉదాహరణ మాత్రమే.  
–రాజేశ్వరి, నిర్వాహకులు తోడు నీడ సీనియర్‌ సిటిజన్స్‌ సంక్షేమ సంఘం   

(చదవండి: ‘లింక్‌’ ప్యాకేజ్‌... అనుసంధాన రోడ్లకు రూ.2410 కోట్లు)

మరిన్ని వార్తలు