జీవిత సమస్య: పోరుబాట వదలడమా? ప్రాణాలు పోవడమా?

23 Jun, 2021 15:34 IST|Sakshi

సాక్షి, హైదరాబద్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి అడవుల్లో ఉన్న మావోయిస్టులను సైతం మట్టుబెడుతోంది. అనేక ఎన్‌కౌంటర్‌లను ఎదుర్కొని పోరాడి పొరుబాటలో నడిచిన అగ్రనేతలను కరోనా అంతమొందిస్తోంది. ఇప్పటికే అనేక మంది అగ్రనేతలకు పాజిటివ్ వచ్చి చికిత్స లేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా మావోయిస్ట్ పార్టీ తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీ హరిభూషన్ (50) గత కొంత కాలంగా కరోనా వైరస్ సోకి బాధపడుతూ సోమవారం ఉదయం గుండె నొప్పితో మరణించినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ తెలిపారు.

హరిభూషన్‌ మరణంతో మావోయిస్ట్ పార్టీలోని అగ్రనాయకులు, క్రింది స్థాయి నాయకులు, సభ్యులు కూడా కరోనా వైరస్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయ్యిందని అన్నారు. సరైన వైద్యం అందక మావోయిస్ట్ నేతలు సోబ్రాయి, నందు, హరిభూషన్ ఇతర నాయకుల మరణించారని, దీనికి మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలే భాద్యత వహించాలని ఎస్పీ అన్నారు.

ఇక కోవిడ్‌ బారిన పడిన మావోయిస్టు నేతలు ఎక్కడ, ఎలా వైద్య సేవలు పొందుతున్నారు. ఎలా మనుగడ సాగిస్తున్నారు అన్నదే ఇప్పుడు అందరిని వేధిస్తున్న ప్రశ్న. 25 రోజుల క్రితం మావోయిస్టు కీలక నేత దండకారణ్య స్పెషల్‌ జోన్‌ డివిజనల్‌ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్‌ అలియాస్‌ శోభ్రాయ్‌ అలియాస్‌ మోహన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతణ్ని జుడీషియల్‌ రిమాండ్‌కు పంపే క్రమంలో చేసిన వైద్య పరీక్షల్లో అతనికి కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పోలీసులు ఈ కోణంలో ఆరా తీశారు. 

ప్రస్తుతం మావోయిస్టు పార్టీలోని కీలకమైన పన్నెండు మంది నేతలు కోవిడ్‌ పాజిటివ్‌తో బాధపడుతున్నారన్న విషయం వెల్లడైంది. వీరిలో కటకం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్‌, తిప్పరి తిరుపతి అలియాస్‌ దేవుజి, బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌, కటకం రాజిరెడ్డి అలియాస్‌ ధర్మన్న, కట్టా రాంచందర్‌రెడ్డి అలియాస్‌ వికల్ప్‌, మూల దేవేందర్‌రెడ్డి అలియాస్‌ మాస దడ, కంకటి వెంకటయ్య అలియాస్‌ వికాస్‌, ముచ్చకి ఉజల్‌ అలియాస్‌ రఘు, కొడి మంజుల అలియాస్‌ నిర్మల, పూసం పద్మ, కాకర్ల సునీత అలియాస్‌ బుర్రా ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది

మారుమూల గిరిజన గూడేల్లో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం.. అక్కడకు వైద్య బృందాలు వెళ్లే పరిస్థితి లేకపోవడం.. వైరస్‌ సోకిన వారికి పార్టీ సత్వరమే అనుమతి ఇవ్వకపోవడంతో ఇది తీవ్రరూపం దాలుస్తోంది. దీనిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పలుమార్లు ప్రకటనలు జారీ చేశాయి. కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన మావోయిస్టు నేతలు, క్యాడర్‌, ఇంకా ఇతరేతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉద్యమాన్ని వదలి జనజీవన స్రవంతిలోకి రావాలని, తమ తమ రాష్ట్ర ప్రభుత్వాలు మెరుగైన వైద్యం అందిస్తాయని ప్రకటించినా స్పందన రాలేదు. అయితే కరోనా వైరస్‌ విషయంలో మావోయిస్టులు తీసుకున్న వైఖరి క్యాడర్‌ను నిరాశా నిస్పృహల్లోకి తీసుకెళుతోంది అని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కోవిడ్‌ నేపథ్యంలో ఇప్పటికే ఈ నెలలో 11 మంది మావోయిస్ట్‌లు లొంగిపోయినట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి.

మరిన్ని వార్తలు