మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం.. వెలుగులోకి సంచలన విషయాలు

24 Feb, 2023 13:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరంగల్‌ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ఆత్మాహత్యాయత్నం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వరంగల్‌ ఏసీపీ బోనాల కిషన్‌ నిర్లక్ష్యం వల్లే ప్రీతి ప్రాణాలు తీసుకోవలనుకున్నట్టు పాల్పడినట్లు తెలుస్తోంది.

తనను వేధిస్తున్న సీనియర్‌ విద్యార్థి సైఫ్ అఘాయిత్యాల గురించి ప్రీతి పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. గత కాలంగా సైఫ్‌ ఆమెను వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ప్రీతి తన తండ్రికి చెప్పింది. తండ్రి స్వయంగా ఆర్ ఎస్సై కావడంతో పోలీస్ భద్రతా లభిస్తుందని విద్యార్థిని ఎదురుచూసింది. అయితే తన తండ్రి ఏసీపీ బోనాల కిషన్‌కు ఫోన్ చేసి వివరాలు చెప్పినా స్పందించలేదు.

మరోసారి ఏసీపీకి మెసేజ్‌ చేసినా అటునుంచి రెస్పాన్స్ రాకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై ఈ విషయాన్ని కూతురికి చెప్పాడు. దీంతో పోలీసుల సహకారం కూడా రాకపోవడం, ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది.  తనకు హోంమంత్రి మహమూద్‌ అలీ అండదండలు ఉన్నాయని కొంతకాలంగా సైఫ్‌ వేధిస్తున్నట్లు ప్రీతి తన తండ్రికి తెలిపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సైఫ్ వేధింపుల గురించి తన తండ్రికి ప్రీతి పెట్టిన మెసేజ్‌లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

కాగా మెడికో విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రీతి కిడ్నీ, గుండె పనితీరు కొంచెం మెరుగవుతుందని, నిపుణులైన వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు. ఆమెను కాపాడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని బులెటెన్‌లో పేర్కొన్నారు.

మరోవైపు మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై విచారణ కొనసాగుతోంది. వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్‌ విద్యార్థి సైఫ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఫోన్‌ చాటింగ్‌తోపాటు పలు కీలక ఆధారాలు సేకరించారు. సైఫ్‌పై ఎస్సీ,ఎస్టీ, అట్రాసిటీ, ర్యాగింగ్‌ కేసులు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు