అడ్డొస్తే ట్రాక్టర్లతో తొక్కేస్తాం! 

13 Sep, 2020 04:21 IST|Sakshi
మరికల్‌ మండలం మన్నెవాగులో ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకున్న గ్రామస్తులు 

ఇసుక మాఫియా దౌర్జన్యం

తిరగబడిన గ్రామస్తులు 

మన్నెవాగులో ట్రాక్టర్లు వదిలి పరారీ

మరికల్‌ (నారాయణపేట): ‘ఇసుక ట్రాక్టర్లకు అడ్డువస్తే వాటితోనే తొక్కించుకుంటూ వెళ్తాం..’అంటూ గ్రామస్తులను ఇసుక మాఫియా హెచ్చరించింది. అయితే.. వారి తాటాకు చప్పుళ్లకు భయపడకుండా గ్రామస్తులు తిరగబడడంతో ట్రాక్టర్లను వదిలి పరారయ్యారు. ఈ సంఘటన శనివారం నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం జిన్నారంలోని మన్నెవాగు వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. మన్నెవాగు నుంచి నెల రోజుల నుంచి ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు, పోలీసుల దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదు. సమీపంలోని మన్నెవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలింపుతో చుట్టుపక్కల వ్యవసాయ బోర్లలో నీటిమట్టం పడిపోతోంది.

కాగా, శనివారం ఉదయం ఇసుక కోసం ఈ వాగులోకి వచ్చిన సుమారు పది ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. రెచ్చిపోయిన ఇసుక వ్యాపారులు ‘మంచి మాటలతో చెబుతున్నాం. అడ్డు రాకండి.. అడ్డొస్తే ట్రాక్టర్లతో తొక్కిస్తాం..’అంటూ బెదిరించారు. అయితే గ్రామస్తులు తిరగబడటంతో ట్రాక్టర్లను వదిలి పరారయ్యారు. ఈ క్రమంలో వాగులోని నీటిగుంతలో కొన్ని వాహనాలు ఇరుక్కుపోయాయి. ఈ విషయాన్ని తహసీల్దార్, పోలీసులకు సమాచారం ఇచ్చినా ఎవరు అక్కడికి రాకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వాగులో నుంచి ఇసుకను అమ్ముకుంటున్న వారితో పాటు అనుమతి లేకుండా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్న వారిపైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

అనుమతి లేకుండా తరలిస్తే చర్యలు 
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతువేదికలు, శ్మశానవాటికలకు మాత్రమే ఇసుకకు అనుమతి ఇచ్చాం. ఒకవేళ ఇసుకను అక్రమంగా తరలిస్తే ఎంతటి వారైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. గ్రామస్తులను భయాందోళనలకు గురిచేసే వారిపై కేసులు నమోదు చేయిస్తాం. – శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్, మరికల్‌

మరిన్ని వార్తలు