మరో ఏడు ఒమిక్రాన్‌ కేసులు 

29 Dec, 2021 02:26 IST|Sakshi

మొత్తం 62కు చేరిన సంఖ్య

228కి పెరిగిన సాధారణ కరోనా పాజిటివ్‌ల సంఖ్య

అందులో సగం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మంగళవారం కొత్తగా మరో ఏడు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. అందులో మూడు ముప్పున్న దేశాలకు చెందినవి కాగా, నాలుగు ముప్పులేని దేశాల నుంచి వచ్చిన వారివి అని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 62కు ఎగబాకింది. అందులో ఇప్పటివరకు 13 మంది కోలుకున్నారు. కాగా ముప్పున్న దేశాల నుంచి ఒకరోజులో 165 మంది ప్రయాణికులు కాగా, అందులో నలుగురికి సాధారణ కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపించారు. మొత్తం 13 కేసులకు సంబంధించి  ఫలితాలు రావాల్సి ఉంది. ఇదిలావుండగా, ఇప్పటివరకు ముప్పున్న దేశాల నుంచి 11,921 మంది హైదరాబాద్‌ విమానాశ్రయానికి వచ్చారు. ఇక రాష్ట్రంలో మంగళవారం 228 మందికి సాధారణ కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అందులో అత్యధికంగా 110 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. ఒకేసారి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఒక రోజులో ఒకరు చని పోగా, మొత్తం ఇప్పటివరకు కరోనాతో 4,024 మంది మృతిచెందారు.   

మరిన్ని వార్తలు