సొమ్ములివ్వకుంటే ఎలా బతకాలి?

10 Aug, 2021 01:45 IST|Sakshi
బస్‌భవన్‌ వద్ద ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల నిరసన

ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగుల తీవ్ర ఆవేదన

బస్‌భవన్‌ ఎదుట వందల మంది నిరసన

వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్‌

అధికారులకు వినతిపత్రాలు అందజేత

సాక్షి, హైదరాబాద్‌: ‘పెన్షన్‌ లేదు, సెటిల్మెంట్‌ సొమ్ము పూర్తిగా చెల్లించట్లేదు. మరి మేం బతికేదెట్లా? తొలి, మలిదశ ఉద్యమాల్లో పాల్గొన్న మాకు రాష్ట్ర సాధన తర్వాత ఎందుకీ బాధలు?’అంటూ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం తీరుతో సుమారు 20 వేల మంది రిటైర్ట్‌ ఉద్యోగుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయన్నారు. తమకు వెంటనే బకాయిలు చెల్లించాలనే డిమాండ్‌తో సోమవారం హైదరాబాద్‌లోని ‘బ స్‌ భవన్‌’వద్ద వందలాది మంది నిరసన చేపట్టారు. ఇన్‌చార్జి ఎండీ అందుబాటులో లేకపోవడంతో ఇతర అధికారులకు వినతిపత్రాలు సమర్పించి వెనుదిరిగారు. ఆర్టీసీ చరిత్రలో రిౖటెర్డ్‌ ఉద్యోగులు తొలిసారి ఆందోళనకు దిగడం గమనార్హం. 

నిరసన ఇందుకే... 
► ఆర్టీసీలో 2018 ఏప్రిల్‌ తర్వాత రిటైరైన సుమారు 2 వేల మందికి పూర్తిగా సెటిల్‌మెంట్లు చేయట్లేదు. పెండింగ్‌లో ఉంచిన మొత్తాన్ని ఇప్పటివరకు చెల్లించకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. 
► ఆర్టీసీలో పింఛన్‌ విధానం లేనందున రిటైరయ్యే ఉద్యోగులు తమకు అందిన మొత్తాన్ని ఆర్టీసీ ఆధ్వర్యంలోని సహకార పరపతి సంఘంలో డిపాజిట్లు చేశారు. ఎక్కువ వడ్డీ వస్తున్నందున ఎక్కువ మంది ఇందులోనే పెట్టారు. అయితే ఈ సంఘానికి ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించే నిర్ధారిత మొత్తం జమ కావట్లేదు. దాన్ని ఆర్టీసీ సొంతానికి వాడుకుంటోంది. ఫలితంగా రిటై ర్డ్‌ ఉద్యోగులకు డిపాజిట్లపై సంఘం వడ్డీ చెల్లించట్లేదు. అలా 10 వేల మందికి చెల్లింపులు నిలిచిపోయాయి. 
► సర్వీసులో ఉన్నప్పుడే ఉద్యోగులకు స్టాఫ్‌ రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ స్కీం కింద ప్రతినెలా జీతంలో కొంత కోత పెట్టి ఓ నిధిగా చేసి దాన్నుంచి రిటైరైన వారికి నెలనెలా జరిపే చెల్లింపులూ నిలిచిపోయాయి. వాటితోపాటు సకల జనుల సమ్మె కాలంలో విధులకు రాని కాలాన్ని ప్రత్యేక సెలవుగా పరిగణిస్తూ జీతం చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సమయంలో సర్వీసులో ఉండి ఆ తర్వాత రిటైరైన వారికి ఆ మొత్తం కూడా ఇప్పటిదాకా చెల్లించలేదు.

ఉద్యోగులదీ నిరసన బాటే... 
సీసీఎస్‌లోని కొందరు సభ్యులు కూడా సోమవారం బస్‌భవన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆ తర్వాత సీసీఎస్‌ కార్యాలయం వద్ద కూడా ఆందోళన చేపట్టారు. గతంలో తమ జీతాల నుంచి ఏడు శాతం మినహాయించి సీసీఎస్‌కు జమ చేసేవారని, దాన్ని ఆర్టీసీ వినియోగించుకుంటున్న నేపథ్యంలో కేవలం ఒక శాతమే మినహాయించేలా తీర్మానం చేసినా ఏడు శాతం ఎందుకు కోత పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యంపై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.

కారణం ఏమిటి?
అసలే తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆర్టీసీ యాజమాన్యం ప్రతినెలా ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకే కటకటలాడుతోంది. ఈ పరిస్థితుల్లో రిటైరైన ఉద్యోగులకు పూర్తిస్థాయిలో సెటిల్మెంట్లు చేసే పరిస్థితి లేక చేతులెత్తేసింది. 

ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి... 
గతంలో ఎన్నడూ లేనట్లుగా విశ్రాంత, ప్రస్తుత ఉద్యోగులు ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితులు రావటం దారుణం. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని వారికి చెల్లింపులు జరపాలి 
– ఎన్‌ఎంయూ నేతలు కమాల్‌రెడ్డి, నరేందర్‌ 

నిపుణుల కమిటీ వేయాలి...
ప్రస్తుతం ఆర్టీసీకి రుణాలు ఇచ్చేందుకు కూడా ఆర్థిక సంస్థ లు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడేందుకు ఉన్న మార్గాలను సూచించేం దుకు ప్రభుత్వం వెంటనే నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి.
– ఆర్టీసీ బోర్డు మాజీ డైరక్టర్‌ నాగేశ్వరరావు   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు