ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ కొరత..!

15 Apr, 2021 03:33 IST|Sakshi

ప్రభుత్వం వద్ద వారానికి సరిపడా ఆక్సిజన్‌ నిల్వలు 

15 రోజులకు సరిపడా రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు 

రెమిడెసివిర్‌ను బ్లాక్‌ చేస్తున్న కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు, అధిక ధరలకు విక్రయం 

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో అనేక మంది కరోనా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత డిమాండ్‌ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రోజుకు 100 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ప్రైవేట్‌లో సుమారు 70 శాతం అవసరం ఉంది. కానీ అవసరం మేరకు సరఫరా లేదని అధికారులు చెబుతున్నారు. ‘ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ కొరత ఉన్న మాట వాస్తవమే. దాన్ని సరిదిద్దుకోవాలని మేం సూచించాం. లిక్విడ్‌ ఆక్సిజన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని గతంలోనే కోరాం.

ఒకట్రెండు ఆసుపత్రులు మాత్రమే వాటిని ఏర్పాటు చేసుకున్నాయి. మిగిలినవన్నీ సాధారణ ఆక్సిజన్‌ సిలెండర్లపైనే ఆధారపడుతున్నాయి’అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. దీంతో ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌కు తీవ్రమైన కొరత ఏర్పడిందని తెలిపారు. రోగులను చేర్చుకుని ఆక్సిజన్‌ అందించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారానికి సరిపడా ఆక్సిజన్‌ నిల్వలు ఉన్నాయని వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. కర్ణాటక, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి అవసరమైన లిక్విడ్‌ ఆక్సిజన్‌ మరో వారం రోజుల్లో వస్తుందని పేర్కొంది.  

రెమిడెసివిర్‌కు తీవ్ర కొరత.. 
రెమిడెసివిర్‌ ఇంజెక్షన్ల విషయంలోనూ ప్రైవేట్‌ ఆసుపత్రుల మధ్య తీవ్రమైన ఆధిపత్యం కొనసాగుతోంది. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోని కొన్నింటికి రెమిడెసివిర్‌ అందట్లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కొన్ని చోట్ల బ్లాక్‌ మార్కెట్‌లో రెమిడెసివిర్‌ అమ్ముడవుతోంది. దాని సాధారణ ధర రూ.5 వేలు కాగా, బ్లాక్‌ మార్కెట్‌లో రూ.25 వేల వరకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం వద్ద మాత్రం ప్రస్తుతం 45 వేల రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుత డిమాండ్‌ ప్రకారం మరో 15 రోజుల వరకు అవి సరిపోతాయని వైద్య వర్గాలు వెల్లడించాయి. కాగా, 3 నెలలకు సరిపడా 2 లక్షల రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. అందులో రెండ్రోజుల్లో 45 వేలు రాష్ట్రానికి వస్తాయని ఓ కీలకాధికారి తెలిపారు. ప్రస్తుతం 5 లక్షల హోం ఐసోలేషన్‌ కిట్లు అందుబాటులో ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

  • రాష్ట్రంలో బుధవారం 1.25 లక్షల మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇంకా 6,13,380 టీకా డోస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి మరో నాలుగైదు రోజులకు సరిపోతాయి. 
  • ప్రభుత్వం వద్ద ప్రస్తుతం రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు 45 వేలు ఉన్నాయి. అవి 10–15 రోజులకు సరిపోతాయి. 
  • 62 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా కోసం 8,643 పడకలు ఉండగా, 2,408 నిండిపోగా, ఇంకా 6,235 ఖాళీగా ఉన్నాయి. మొత్తం 1,642  పడకల్లో 542 నిండిపోయాయి.
  • 5,292 ఆక్సిజన్‌ పడకల్లో 1,434 నిండిపోగా, 3,858 ఖాళీగా ఉన్నాయి. ఇక 1,709 ఐసీయూ/వెంటిలేటర్లు ఉండగా, అందులో 432 నిండిపోయాయి. ఇంకా 1,277 ఖాళీగా ఉన్నాయి.

చదవండి: కరోనా రోగుల్లో మూడోవంతు ఆసుపత్రుల్లోనే 

మరిన్ని వార్తలు