బండి కనిపిస్తే మాయం చేస్తారు

20 Feb, 2022 01:18 IST|Sakshi
నిందితులతో పాటు ద్విచక్ర వాహనాలను స్వాదీనం చేసుకున్న షాహినాయత్‌గంజ్‌ పోలీసులు

ద్విచక్ర వాహనాలు మాయం చేసిన నిందితుల అరెస్ట్‌

19 యాక్టివా ద్విచక్ర వాహనాలు స్వాదీనం

జియాగూడ: నగరంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పట్టుకుని వారి వద్ద నుండి వాహనాలను స్వాదీనం చేసుకున్నట్లు పశ్చిమ  మండలం డీసీపీ జోయల్‌ డావిస్‌ అన్నారు.  శనివారం షాహినాయత్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌లో గోషామహాల్‌ ఏసీపీ ఆర్‌.సతీస్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. నగరంలోని వెస్ట్, సౌత్, ఈస్ట్, సెంట్రల్‌ జోన్ల పరిధిలో ద్విచక్ర వాహనాలు దొంగతనం జరుగుతున్నాయి.

దీంతో షాహినాయత్‌ గంజ్‌ పోలీసుల క్రైమ్‌ టీమ్‌ నిందితులను పట్టుకున్నారన్నారు. జహనుమాకు చెందిన అబ్దుల్‌ వాహిద్‌(63), వారసిగూడలోని మహిమూద్‌గూడకు చెందిన మహ్మద్‌ సోయేల్‌ హుల్‌హక్‌ (28)లు రాత్రి వేళల్లో  బస్తీలలో ఇంటి బయట పార్కు చేసిన యాక్టివా ద్విచక్ర వాహనాలను నకిలీ తాళాలతో ఓపెన్‌ చేసి ఎత్తుకువెళ్లేవారు. వాటిని మెకానిక్‌ షాపులు, స్క్రాబ్‌ దుకాణాలలో విక్రయించే వారు.

అనుమానం రాకుండా కుటుంబ సభ్యులకు వైద్యం కోసం డబ్బులు అవసరం అయ్యాయని నమ్మిస్తూ ఆధార్‌కార్డు కూడా ఇచ్చేవారు. షాహినాయత్‌గంజ్‌ సీ.ఐ. వై.అజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో డీఎస్‌ఐ. జి.రాజేశ్వర్‌ రెడ్డి, క్రైమ్‌ టీం సిబ్బందితో కలిసి బేగంబజార్‌ నుండి చంద్రాయణగుట్ట వరకు గల వివిధ దారుల్లో, బస్తీల్లో వందకు పైగా సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులు దొంగిలించిన వాహనాలను స్వాదీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీసీపీ జోయల్‌ డావిస్‌ క్రైమ్‌ టీమ్‌ను అభినందించారు. 

మరిన్ని వార్తలు