కేశవాపూర్‌ ప్రాజెక్టుకు ‘అసైన్డ్‌’ చిక్కులు

16 Oct, 2021 20:46 IST|Sakshi
కేశవాపూర్‌ ప్రాజెక్టు నిర్మించాల్సింది ఈ భూముల్లోనే

64 ఎకరాలు.. 200 మంది లబ్ధిదారులు

ప్రభుత్వ పరిహారం ఎకరాకు రూ.37 లక్షలు

రూ.కోటి డిమాండ్‌ చేస్తున్న నిర్వాసితులు

ప్రాజెక్టు నిర్మాణంలో అనేక ఆటంకాలు 

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ సిగలో భారీ జల భాండాగారం ఏర్పాటు చేసే పనులకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. శామీర్‌పేట్‌ మండలం కేశవాపూర్‌ లో 5 టీఎంసీల గోదావరి జలాల నిల్వ సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన రిజర్వాయర్‌కు అసైన్డ్‌ భూములు, అటవీ భూముల సేకరణ ప్రక్రియ కత్తిమీద సాములా మారింది. ప్రధానంగా అసైన్డ్‌ భూములకు.. ఎకరాకు రూ.37 లక్షలు పరిహారంగా చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కానీ ఎకరానికి రూ. కోటి పరిహారంగా అందించాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. 

భూసేకరణ విషయమై రెవెన్యూ అధికారులు పలుమార్లు నిర్వాసితులయ్యే రైతులతో చర్చించినప్పటికీ వారు మెట్టుదిగడంలేదని సమాచారం. తాము కోరిన పరిహారాన్ని చెల్లించకుండా బలవంతంగా తమ భూములు లాక్కుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని స్పష్టంచేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అవుతుందా లేదా అన్న అంశం సస్పెన్స్‌గా మారింది. కాగా.. సుమారు అరవై నాలుగు ఎకరాలకు సంబంధించిన అసైన్డ్‌ భూములకు 200 మంది యజమానులు ఉన్నారు. వీరంతా తమకు న్యాయం చేయాలని పట్టుబడుతున్నారు. ఈ వివాదాన్ని ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందన్న అంశం హాట్‌ టాపిక్‌ గా మారింది. 

అటవీ భూములు సైతం..
కేశవాపూర్‌ భారీ స్టోరేజి రిజర్వాయర్‌ నిర్మాణానికి  సుమారు 1245 ఎకరాల అటవీ భూములను సేకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ శాఖకు అంతే మొత్తంలో భూములను కేటాయించాల్సి ఉంది. ఇందుకోసం జగిత్యాల్, సూర్యాపేట్, భూపాలపల్లి తదితర జిల్లాల్లో అటవీశాఖ సూచనల మేరకు ఫారెస్ట్‌ రిజర్వ్‌ల ఏర్పాటుకు అనుమతించాలని ప్రభుత్వం కేంద్ర అటవీశాఖను కోరింది. ఇక ఈ ప్రాజెక్టుకు పర్యావరణ, అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖలు సైతం ప్రాథమిక అనుమతులు మంజూరు చేసినా.. తుది అనుమతులు జారీచేయాల్సి ఉంది.  (చదవండి: మనీ గురించి ఆలోచించకు.. లగ్జరీగా ఉంటే చూడు)

మరిన్ని వార్తలు