మహాక్రతువు సుసంపన్నం.. శాంతి కల్యాణం వాయిదా

15 Feb, 2022 02:42 IST|Sakshi
హైదరాబాద్‌ ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో బంగారు సమతామూర్తి విగ్రహానికి అభిషేకం చేస్తున్న చినజీయర్‌ స్వామి

సమతామూర్తిని సందర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ప్రశాంతంగా ముగిసిన వేడుకలు

19వ తేదీకి శాంతి కల్యాణం వాయిదా వేస్తున్నట్లు చినజీయర్‌ ప్రకటన

చివరి రోజు సువర్ణమూర్తికి ప్రాణప్రతిష్ఠ, కుంభాభిషేకం

మహా పూర్ణాహుతితో ముగిసిన శ్రీలక్ష్మీనారాయణ క్రతువు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: పన్నెండు రోజుల పాటు ఐదువేల మంది రుత్వికులు అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించిన శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతువు సోమవారంతో పరిపూర్ణమైంది. రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో భాగంగా ప్రవచన మండపంలో రోజూ అష్టాక్షరీ మంత్ర పఠనం, విష్ణుసహస్ర పారాయణం నిర్వహించారు. అలాగే, 114 యాగశాలల్లో 1035 హోమకుండలాల్లో రెండు లక్షల కేజీల స్వచ్ఛమైన ఆవు నెయ్యితో విష్వక్సేనేష్టి, నారసింహ ఇష్టి, లక్ష్మీనారాయణ ఇష్టి, పరమేష్టి, వైభవేష్టి, హయగ్రీవ ఇష్టి, వైవాయిహిక ఇష్టి, సుదర్శన ఇష్టి, వైనతే ఇష్టి యాగ పూజలను నిర్వహించారు.

ఉదయం త్రిదండి చినజీయర్‌ స్వామి యాగశాలలో పంచసూక్త హవనం అనంతరం శాంతిహోమం నిర్వహించారు. యాగశాలకు నలుదిక్కుల యజ్ఞ గుండాల దగ్గరున్న ద్వారపాలకుల అనుమతి తీసుకుని మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఆ తర్వాత యాగశాల నుంచి సమతామూర్తి విగ్రహం వరకు పెరుమాళ్‌ యాత్రను నిర్వహించారు. 120 కేజీల రామానుజాచార్యుల బంగారు ప్రతిమకు చినజీయర్‌ స్వామి ప్రాణప్రతిష్ఠ చేశారు. ప్రతి యాగశాల నుంచి దేవతామూర్తులను ఆవాహన చేసిన కలశాలను సమంత్రకంగా సమతాక్షేత్ర స్ఫూర్తి కేంద్రానికి తీసుకెళ్లి కుంభప్రోక్షణ చేసి అభిషేకాన్ని నిర్వహించారు.

ప్రాణప్రతిష్ఠ, కుంభాభిషేకం కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, మైహోం గ్రూప్‌ అధినేత జూపల్లి రామేశ్వరరావు పాల్గొన్నారు. సాయంత్రం గ్లైడర్స్‌ సమతమూర్తి విగ్రహంపై పూలవర్షం కురిపించారు. అనంతరం దేశవిదేశాల నుంచి వచ్చిన రుత్వికులను ఘనంగా సత్కరించారు. ఈ పన్నెండు రోజులు అష్టాక్షరీ మంత్ర పఠనం, చతుర్వేద పారాయణం, ఐదు వేల మంది కళాకారుల ప్రదర్శనలు, మహా పూర్ణాహుతితో ఈ మహాక్రతువు సుసంపన్నమైంది. 

గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం: కిషన్‌రెడ్డి
ముచ్చింతల్‌ భవిష్యత్తులో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా, హిందూ దర్శన ప్రదేశంగా విలసిల్లుతుందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి జోస్యం చెప్పారు. శ్రీరామనగరంలో శిలాసంపద అత్యద్భుతంగా ఉందని కొనియాడారు. దేశంలోని ప్రముఖ దివ్యదేశాలను ఒకే చోట దర్శించుకోవడం ఆనందంగా ఉందని, కార్యనిర్వాకుల కృషి, వైదిక ప్రక్రియలు ఈ వేడుకకు వన్నె తెచ్చాయన్నారు. ఈ ఉత్సవాలు ప్రారంభమైన రోజు నుంచి చివరి వరకు ఎనిమిది లక్షల మందికిపైగా శ్రీరామనగరాన్ని సందర్శించుకున్నట్లు అంచనా. 

శాంతి కల్యాణం వాయిదా
నిజానికి సోమవారం ఉదయం మహా పూర్ణాహుతి కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ హాజరవుతారని నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. దీంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ముచ్చింతల్‌ రహదారులు, సమతామూర్తి ప్రాంగణంలో భారీగా కేసీఆర్, కేటీఆర్‌ కటౌట్లను ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులు కూడా ఆ మేరకు భద్రతా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం తర్వాత కూడా సీఎం రాలేదు. సాయంత్రం ఆయా దివ్యదేశాల్లోని మూర్తులకు నిర్వహించే శాంతి కల్యాణంలో పాల్గొంటారని ప్రచారం జరిగింది. కానీ ఈ వేడుకలకు కూడా ఆయన దూరంగా ఉన్నారు.

ఈ సమయంలో శాంతి కల్యాణం నిర్వహిస్తే.. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన రుత్వికులు, సేవకుల తిరుగు ప్రయాణానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటూ ఈ శాంతి కల్యాణాన్ని 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు చినజీయర్‌ స్వామి ప్రకటించారు. ఆయా ఆలయాల్లోని 108 విగ్రహ స్వరూపాలకు ఒకే చోట, ఒకే సమయంలో శాంతి కల్యాణం జరిపించడం చరిత్రలో ఇదే మొదటిసారి అవుతుందని చెప్పారు. 

మరిన్ని వార్తలు