షీ ట్యాక్సీ ..స్పందన నాస్తి..

3 Mar, 2021 08:14 IST|Sakshi

సింగిల్‌ డిజిట్‌లోనే దరఖాస్తులు

మహిళ డ్రైవర్లుగా ప్రత్యేక ట్యాక్సీలు

ముగిసిన గడువు, ప్రచారం నామమాత్రం 

ఎంపికైన అభ్యర్థులకు 45 శాతం సబ్సిడీ

ఆదిలాబాద్‌: మహిళల భద్రతకు ప్రవేశపెట్టిన 24/7 షీ–ట్యాక్సీ పథకానికి జిల్లాలో ఆదరణ కరువైంది. దరఖాస్తు గడువు మార్చి 1తో ముగిసింది. సింగిల్‌ డిజిట్‌లోనే దరఖాస్తులు వచ్చాయి. ఆదరణ కరువా.. ప్రచార లోపమో.. తెలియదు కానీ జిల్లా మొత్తంగా కేవలం నాలుగు దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మహిళ డ్రైవర్లుగా ట్యాక్సీలు నడిపేందుకు ప్రభుత్వం సబ్సిడీపై కార్లను అందజేస్తోంది. మహిళలు, విద్యార్థినులు, ఒంటరిగా ప్రయాణం చేసే యువతులు ఎలాంటి భయాందోళనకు  గురికాకుండా వివిధ ప్రదేశాలకు వెళ్లేందుకు మహిళ డ్రైవర్ల ద్వారా వారి గమ్యస్థానానికి చేర్చేందుకు ఈ పథకం ఉపయుక్తంగా ఉంటుందనే ఆలోచనతో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మెట్రో నగరాల్లోనే దీనికి ఆదరణ ఉంటుందని, పట్టణాల్లో దీనిపై ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయం అధికారులు వ్యక్తం చేస్తున్నారు. 

ప్రచార లోపమే కారణమా..
మహిళ, శిశు సంక్షేమ శాఖ, రవాణ శాఖల ద్వారా భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ సౌజన్యంతో మహిళ డ్రైవర్లుగా ఆసక్తి ఉన్న అభ్యర్థినులకు షీ–టీమ్‌ స్కీమ్‌ ద్వారా అమలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి 35శాతం సబ్సిడీ, 10శాతం మార్జిన్‌ మనీ మొత్తం కలిపి 45శాతం సబ్సిడీ  అందచేస్తారు. మిగితా మొత్తం అభ్యర్థినిలే వెచ్చించాలి. ఆ అభ్యర్థులకు యాశోద దీదీత ఫౌండేషన్‌ ద్వారా సాంకేతిక శిక్షణ ఇప్పిస్తారు. ఆసక్తి ఉన్న మహిళలు మొదట దరఖాస్తు చేసుకున్న తర్వాత వారికి ట్రైనింగ్‌ తర్వాత వాహనం సమకూర్చుతారు. ఈ పథకంపై సరైన ప్రచారం లేక దరఖాస్తుకు ముందుకు రాలేదు. మహిళ, శిశు సంక్షేమ శాఖాధికారులు కేవలం ప్రకటనలకే పరిమితమై చేతులు దులుపుకున్నారనే విమర్శలున్నాయి. అసలు ఈ పథకంపై ఈ శాఖలోని వివిధ ప్రాజెక్టు అధికారిణిలకే అవగాహన లేకపోవడం గమనార్హం. ఆయా ప్రాజెక్టుల్లోని సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా ఈ పథకానికి సంబంధించి ప్రచారం చేపట్టి ఉంటే దరఖాస్తుదారుల సంఖ్య అధికంగా ఉండేదనే అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది. 

పట్టణంలో ఆదరణ తక్కువే
షీ–ట్యాక్సీ పథకానికి జిల్లాలో అభ్యర్థులు ఆసక్తి కనబర్చలేదు. ప్రధానంగా మెట్రో నగరాల్లో దీనికి డిమాండ్‌ ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థినులకు 45శాతం సబ్సిడీ వర్తించనుంది.  అదేవిధంగా శిక్షణ కూడా ఇస్తాం.   – మిల్కా, మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారి, ఆదిలాబాద్‌ 

చదవండి: మరోసారి కరోనా విజృంభణ.. 14 వరకు కర్ఫ్యూ 

మరిన్ని వార్తలు