శేఖర్‌.. సూపర్‌

11 Aug, 2020 06:50 IST|Sakshi
అంతర్జాతీయ గ్లోబల్‌ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ అందుకుంటున్న శేఖర్‌ (ఫైల్‌)

బహుజన భీమ్‌ సోల్జర్‌ ఏర్పాటు 

గుర్తింపుగా గౌరవ డాక్టరేట్‌  

ఐదు అవార్డులు సొంతం 

సామాజిక సేవతో ప్రత్యేక గుర్తింపు 

సంగారెడ్డి అర్బన్‌: సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో గుర్తింపుగా గౌరవ డాక్టరేట్‌తో పాటు, ఐదు ఆవార్డులు సొంతం చేసుకొని పల్పనూరి శేఖర్‌ ఆదర్శంగా నిలిచారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి కూత వేటు దూరంలో ఉన్న చిమ్నాపూర్‌లో జన్మించిన శేఖర్‌ 2002లో అంబేడ్కర్‌ యువజన సంఘం ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా, అనాథలకు అండగా నిలిచారు. దళితుల సమస్యలపై పోరాటాలు చేశారు. వివిధ సంస్థల్లో పని చేస్తూనే బహుజన భీమ్‌ సోల్జర్‌ను ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

జిల్లా కేంద్రంలో ఉన్న దివ్యదిశ అనాథ ఆశ్రమంలో చిన్నారులకు నిత్యావసరాలు, దుస్తులు పంపిణీ, 2007లో నెహ్రూ యువ కేంద్రం సిద్దిపేట కేంద్రంగా పలు సేవా కార్యక్రమాలు చేశారు. «కంది మండలం ధర్మసాగర్‌ చెరువులో 360 ఎకరాల దళితులు భూములు కబ్జాకు గురైతే వారి భూములు తిరిగి ఇప్పించడంలో కీలక పాత్ర పొషించారు. క్రైస్తవ జేఏసీ తరపున చర్చిల్లో పలు సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా, నిరుపేదలకు నిత్యావసరాలు, దుస్తులు పంపిణీ చేశారు. హత్నూర మండలంలో ఓ పరిశ్రమ యాజమాన్యం ఇద్దరు మూగ దంపతుల భూమిని కబ్జా చేస్తే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేశారు. 2017లో హైటెన్షన్‌ వైర్ల భూ బాధితులకు నష్ట పరిహారం ఇప్పించడంలో ఆయన కీలక పాత్ర పొషించారు.  

ఆపదలో ఉన్న వారికి అండగా.. 
రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడమే కాకుండా తాను స్వయంగా రక్తదానం చేసి మనవత్వాన్ని చాటుకున్నారు. అపదలో ఉన్నవారికి అండగా నిలువడంతో పాటు కార్మికుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి సేవలు అందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులైన్స్‌ డ్రైవర్లు హైదరాబాద్‌కు తీసుకెళ్లడానికి డబ్బులు అడగటంతో జెడ్పీ చైర్‌పర్సన్‌ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించారు. ఆసుపత్రుల్లో మృతిచెందిన బాలింతలు, చిన్నారుల పక్షాన న్యాయ పోరాటాలు చేశారు.  

గౌరవ డాక్టరేట్, ఐదు అవార్డులు సొంతం.. 
18 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు గానూ, శేఖర్‌ను గుర్తించి జూన్‌ 20న అంతర్జాతీయ గ్లోబల్‌ యునివర్శిటీ చాన్స్‌లర్, ప్రొఫెసర్ల చేతుల మీదుగా కర్ణాటక రాష్ట్రం బెంగుళూర్‌లో డాక్టరేట్‌ను అందకున్నారు. 2007లో నెహ్రూ యువ కేంద్రం సిద్దిపేట తరపున జాతీయ అవార్డు సొంతం చేసుకున్నారు. 2014లో బెస్ట్‌ సోషల్‌ వర్కర్‌గా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అప్పటి కలెక్టర్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. 2015లో ప్రొఫెసర్‌ జయశంకర్‌ జాతీయ అవార్డును తీసుకున్నారు. 2016లో అంబేడ్కర్‌ జాతీయ అవార్డును ఢిల్లీలో సొంతం చేసుకున్నారు. సేవలకు గుర్తింపుగా విశిష్ట సేవరత్న అవార్డును 2019లో తిరుపతిలో అందుకున్నారు. 

మరిన్ని వార్తలు