అనాథ బాలురకూ ఆశ్రయం! 

3 Nov, 2020 08:24 IST|Sakshi

ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో  ప్రత్యేక షెల్టర్‌ హోంల ఏర్పాటుకు యోచన

ప్రతిపాదనలు రూపొందిస్తున్న మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ

నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదించనున్న యంత్రాంగం..      

సాక్షి, హైదరాబాద్‌: అనాథలు, వసతి కోసం ఎదురు చూసే బాలుర కోసం రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సరికొత్త కార్యాచరణ చేపట్టింది. ఇప్పటివరకు అనాథ బాలికలు, మహిళల కోసమే షెల్టర్‌ హోంలు నిర్వహిస్తున్న ఆ శాఖ.. ఇక బాలుర కోసం ప్రత్యేకంగా వీటిని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ప్రస్తుతం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రానికి ఒక షెల్టర్‌ హోంను ఏర్పాటు చేశారు. వీటిలో అనాథ బాలికలను నేరుగా చేర్చుకుని ఆశ్రయమిస్తారు. అలాగే ఆపదలో ఉన్న మహిళలు, ఇతరత్రా కారణాలతో హింసకు, దాడులకు గురైన వారిని సైతం షెల్టర్‌ హోంలు అక్కున చేర్చుకుని ఆశ్రయం ఇస్తాయి. బాలికలు, మహిళల కోసం నిర్వహించే ఈ హోంలకు ఆ శాఖ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి నిర్వహిస్తోంది.

పూర్తిగా మహిళల ఆధ్వర్యంలోనే ఈ హోంలు కొనసాగుతున్నాయి. అయితే బాలుర కోసం ఇప్పటివరకు ప్రత్యేకించి హోంలు లేవు. బాలల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆరు వసతి గృహాలున్నప్పటికీ.. ఇందులో మెజార్టీ పిల్లలు సమాజంలో పొరపాట్లను చేసి వస్తున్న వారే.. మరోవైపు ప్రతి ఆర్నెల్లకోసారి నిర్వహించే ఆపరేషన్‌ స్మైల్, ఆపరేషన్‌ ముష్కాన్‌ కార్యక్రమాల ద్వారా గుర్తిస్తున్న బాలుర సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఇలా గుర్తించిన వారిని ఎక్కడ వసతి కలి్పంచాలనేది అధికారులకు సమస్యగా మారింది. బాలల సంక్షేమ శాఖ పరిధిలోని హోంలకు పంపిస్తున్నప్పటికీ అనాథ బాలలకు ప్రత్యేక హోం అంటూ లేదు. మరోవైపు సింగిల్‌ పేరెంట్‌ సంరక్షణ నుంచి బయటపడే వారు, తల్లిదండ్రులున్నప్పటికీ ప్రత్యేక పరిస్థితుల్లో వసతి కోసం నిరీక్షిస్తున్న వారిలో బాలుర సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోంలను తెరిచే అంశంపై ఆ శాఖ దృష్టి సారించింది. 

నెలాఖరుకు కొలిక్కి... 
అనాథ బాలుర కోసం ప్రత్యేకంగా షెల్టర్‌ హోంలు తెరిచే అంశంపై రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. ఇక్కడ కేవలం వసతితో పాటు ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం బాలల సంక్షేమ శాఖ పరిధిలోని హోంలకు అనుబంధంగా పాఠశాలలు నిర్వహిస్తున్నారు. షెల్టర్‌ హోంకు వచ్చే పిల్లల వయసుకు తగిన కార్యక్రమాలు అమలు చేసేలా కొత్త హోంల కార్యాచరణ ఉండనుంది. గత నెల రెండో వారంలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ బాలురకు షెల్టర్‌ హోం అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పాత జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఆ మేరకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రతిపాదనల రూపకల్పనకు చర్యలు చేపట్టారు. ఈ నెలాఖరులోగా 10 బాలుర షెల్టర్‌హోంల ఏర్పాటుపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. వీటిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.   

మరిన్ని వార్తలు