కోవిడ్‌ ఎఫెక్ట్‌.. ఇంటింటికి తప్పనిసరిగా మారింది

15 May, 2022 11:44 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: వాహన విస్ఫోటనం గ్రేటర్‌ హైదరాబాద్‌ను బెంబేలెత్తిస్తోంది. కోటిన్నర జనాభా ఉన్న నగరంలో వాహనాల సంఖ్య ఏకంగా 71 లక్షలు దాటింది. ఇందులో ప్రజా రవాణా వాహనాలు పట్టుమని పది లక్షలు కూడా లేవు. సింహభాగం వ్యక్తిగత వాహనాలే. రోజురోజుకూ వేల సంఖ్యలో రోడ్డెక్కుతున్న  వాహనాలతో రహదారులు స్తంభించిపోతున్నాయి. ఇంచుమించు రెండేళ్ల పాటు కోవిడ్‌ కాలంలో స్తంభించిన  ప్రజారవాణా వ్యక్తిగత వాహనాల  వినియోగాన్ని  తారస్థాయికి తీసుకెళ్లింది.

దీంతో ఈ రెండేళ్లలోనే 5 లక్షలకుపైగా కొత్త వాహనాలు  రోడ్డుపైకి వచ్చాయి. రహదారులను విస్తరించి, ఫ్లైఓవర్‌లను ఏర్పాటు చేసినప్పటికీ రద్దీ మాత్రం తగ్గడం లేదు. మరోవైపు  కోవిడ్‌ కంటే  ముందు  నుంచే ప్రజా రవాణా ప్రాధాన్యం తగ్గింది. 2020లో 65 లక్షల వాహనాలు ఉంటే ఇప్పుడు 71 లక్షలు దాటాయి.  

ఇంటింటికీ సొంత బండి... 
సొంత బండి ప్రతి ఇంటికీ తప్పనిసరిగా మారింది. రోజురోజుకూ నగరం విస్తరిస్తోంది. ఔటర్‌ను దాటి పెరిగిపోతోంది. ఇందుకు తగినట్లుగా ప్రజా రవాణా పెరగడం లేదు. దీంతో  నగరానికి  దూరంగా ఉండి, ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం రాకపోకలు సాగించాల్సినవాళ్లు సొంత వాహనాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. నగర శివార్ల నుంచి, కాలనీల నుంచి ప్రధాన మార్గాలకు అనుసంధానం చేసే రవాణా సదుపాయాలు లేకపోవడంతో సొంత ఇల్లైనా, అద్దె ఇంట్లో ఉంటున్నా సరే బండి తప్పనిసరిగా మారింది. 

మొబైల్‌ ఫోన్‌ ఉన్నట్లే బైక్‌.. 
ఇప్పుడు ప్రతి మనిషికి ఒక మొబైల్‌ ఫోన్‌ అనివార్యమైన అవసరంగా మారింది. ఇంచుమించు యువతలో  80 శాతం  మందికి బైక్‌ తప్పనిసరిగా మారింది. చదువు, ఉద్యోగ,వ్యాపార అవసరాలతో  నిమిత్తం లేకుండా ఒక వయసుకు రాగానే  పిల్లలకు బండి కొనివ్వడాన్ని  తల్లిదండ్రులు గొప్పగా భావిస్తున్నారు. రవాణాశాఖలో నమోదైన 71 లక్షల  వాహనాల్లో సుమారు 47 లక్షల వరకు బైక్‌లే కావడం గమనార్హం. మరో 20 లక్షల వరకు కార్లు ఉన్నాయి. మిగతా 5 లక్షల వాహనాల్లో  ఆటోరిక్షాలు, క్యాబ్‌లు, సరుకు రవాణా వాహనాలు, స్కూల్‌ బస్సులు, ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులు, తదితర కేటగిరీలకు చెందిన వాహనాలు ఉన్నాయి.  

ప్రజా రవాణా పెరగాలి   
 వాహన విస్ఫోటనాన్ని అరికట్టేందుకు ప్రజా రవాణా విస్తరణ ఒకటే పరిష్కారం. వ్యక్తిగత వాహనాలను నియంత్రించలేకపోతే రానున్న కొద్ది రోజుల్లోనే వాటి సంఖ్య కోటి దాటే అవకాశం ఉంది.  
– పాండురంగ నాయక్, జేటీసీ, హైదరాబాద్‌

చదవండి: అద్దెకు దొరకవు... అధిక కిరాయిలు!

మరిన్ని వార్తలు