‘మత్తు’ డాక్టర్లు కావలెను

5 Mar, 2021 10:08 IST|Sakshi

ప్రభుత్వ ఆస్పత్రుల్లో అనస్తీషియన్ల కొరత

జిల్లా ప్రసూతి ఆస్పత్రిలో 7 పోస్టులకు ఉన్నది ఒక్కరే

జిల్లా ఆసుపత్రిలో ఉన్నది ఇద్దరే

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మత్తు వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. జిల్లా ప్రసూతి ఆస్పత్రిలో ఏడు అనస్తీషియా వైద్యుల పోస్టులు ఉండగా ఒక్కరే అందుబాటులో ఉన్నారు. మిగిలిన ఆరుపోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖానాపూర్‌ సీహెచ్‌సీతో పాటు భైంసా ఏరియా ఆస్పత్రిలో మత్తు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో సకాలంలో ఆపరేషన్లు చేయలేక వైద్యులు అవస్థలు పడుతున్నారు. శస్త్ర చికిత్స చేయాలంటే మత్తుమందు ఇచ్చే వైద్యుడు అందుబాటులో ఉండాల్సిందే. ఆపరేషన్‌ థియేటర్లో సర్జన్‌తో పాటు అనస్తీషియా వైద్యుడు తప్పనిసరి. వ్యాధి తీవ్రత, రోగి, ఆరోగ్య పరిస్థితిని బట్టి మత్తుమందు ఇస్తారు. మత్తు ఎక్కడ ఇవ్వాలనేది అనస్తీషియనే నిర్ణయిస్తాడు. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో మాత్రమే ఇద్దరు వైద్యులు ఉన్నారు. ఇందులో ఒకరు ఒక వారం పాటు ప్రసూతి ఆస్పత్రిలో కూడా డ్యూటీ చేయాల్సి ఉంటుంది.

జిల్లాలో 21 మందికి ఆరుగురు మాత్రమే

జిల్లా వ్యాప్తంగా మొత్తం 21 అనస్తీషియా వైద్యులు ఉండాల్సి ఉండగా కేవలం ఆరుగురు మాత్రమే పని చేస్తున్నారు. జిల్లాలో కీలకమైంది జిల్లా ఆసుపత్రి, ప్రసూతి ఆసుపత్రి. జిల్లా ఆస్పత్రి, బైంసా ఏరియా ఆసుపత్రుల్లో సివిల్‌ సర్జన్‌తో పాటు డిప్యూటీ సివిల్‌ సర్జన్, అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌ పోస్టులు ఉండాలి. కానీ ఇక్కడ ఇద్దరు మాత్రమే అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలోని ఐసీయూ విభాగంలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో మరో అనస్తీషియా పోస్ట్‌ ఖాళీగా ఉంది. జిల్లా ప్రసూతి ఆస్పత్రిలో ఏడుగురికి ఒక అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌ మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఖానాపూర్‌ సీహెచ్‌సీలో మూడు అనస్తీసియా పోస్టులకుగానూ ఒక్కరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. రూ.కోట్లు వెచ్చించి ఆస్పత్రులు నిర్మిస్తున్న ఆస్పత్రుల్లో ఆపరేషన్‌ థియేటర్లు నిర్మిస్తున్నా, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నా పోస్టుల భర్తీపై సర్కారు దృష్టి సారించకపోవడంతో రోగులకు సరైన వైద్యసేవలు అందడం లేదు.

వైద్యుల కొరతతో ఇబ్బందులు

జిల్లాలోని ప్రసూతి ఆస్పత్రిలో గతేడాది మార్చి నుంచి డిసెంబర్‌ వరకు 4,676 ప్రసవాలు జరిగాయి. ఇందులో 3,688 సిజేరియన్లు, 988 సాధారణ కాన్పులు. జిల్లా ఆసుపత్రిలో గతేడాది మార్చి నుంచి డిసెంబర్‌ వరకు దాదాపు 2,150 ఆపరేషన్లు చేశారు. గత మార్చి నుంచి 2021 ఫిబ్రవరి వరకు బైంసా ఏరియా ఆస్పత్రిలో జరిగిన ఆపరేషన్లు 1089, గత మార్చి నుంచి 2021 ఫిబ్రవరి వరకు బైంసా ఏరియా ఆస్పత్రిలో జరిగిన ప్రసవాలు 2643. కానీ అనస్తీషియా వైద్యులు సరిపడా లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా ఏరియా ఆస్పత్రిలో ఈ విభాగంలో కాంట్రాక్టు పద్ధతిన నియమించడానికి నోటిఫికేషన్‌ వేసినా ఎవరూ ముందుకు రావడం లేదు.

ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం

జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో అనస్తీషియా వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్న మాట వాస్తవమే. అయినా ఎవరికీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా ఆస్పత్రిలోని ఐసీయూ విభాగంలో ఖాళీగా ఉన్న అనస్తీసియా పోస్టు కాంట్రాక్టు పద్ధతిలో నియమించేందుకు చర్యలు తీసుకుంటాం.

– దేవేందర్‌రెడ్డి, డీసీహెచ్‌ఎస్‌ 
 

మరిన్ని వార్తలు