బ్లాక్‌ఫంగస్‌ చికిత్సకు తీవ్ర కొరత.. మందులు తక్కువ.. బాధితులెక్కువ..!

24 May, 2021 00:56 IST|Sakshi

దేశంలో ఆంఫోటెరిసిన్‌ బి నోస్టాక్‌ 

ప్రాధాన్య క్రమంలో కేటాయిస్తున్న కేంద్రం 

రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న బాధితులు 

కేంద్రం నుంచి సరిపడా కేటాయింపుల్లేక అవస్థలు 

సాక్షి, హైదరాబాద్‌: బ్లాక్‌ఫంగస్‌ బాధితులకు చికిత్స జటిలమవుతోంది. రోజురోజుకు రాష్ట్రంలో ఈ ఫంగస్‌ బాధితులు పెరిగిపోతుండగా.. వారికి సరైన వైద్యం ఇచ్చేందుకు సరిపడా మందుల్లేక కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. వైద్య,ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటికే బ్లాక్‌ఫంగస్‌ బాధితుల సంఖ్య దాదాపు 600 దాటింది. కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిని ప్రత్యేకంగా బ్లాక్‌ఫంగస్‌ చికిత్స కోసం కేటాయించారు. దీనికితోడు గాంధీ ఆస్పత్రిలో కూడా బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించారు. బ్లాక్‌ఫంగస్‌ చికిత్సలో కీలకమైన లైపోజోమల్‌ ఆంఫోటెరిసిన్‌ బి. కానీ ఈ మందు నిల్వలకు దేశవ్యాప్తంగా తీవ్ర కొరత ఉంది. దీంతో ఈ మందులను కేంద్రమే రాష్ట్రాలకు కేటాయిస్తూ వస్తోంది. 


రాష్ట్రానికి 890 వయల్స్‌ కేటాయింపు.. 
బ్లాక్‌ ఫంగస్‌ కేసులు అత్యధికంగా గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, కర్ణాటక, తెలంగాణలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈనెల 20 నాటికి 8,848 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు గుర్తించారు. 23,680 లైపోజోమల్‌ ఆంఫోటెరిసిన్‌–బి మందులను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రాధాన్యత క్రమంలో కేంద్రం కేటాయించింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి 890 వయల్స్‌ కేటాయించగా.. అందులో సగం స్టాకు మాత్రమే రాష్ట్రానికి చేరుకుంది. ఆంఫోటెరిసిన్‌– బి మందుకు ప్రత్యామ్నాయమైన పొసకొనజోల్, ఫ్లూకొనజోల్‌ మందులను వినియోగించే వీలున్నప్పటికీ.. వీటికి సైతం కొరత ఏర్పడటంతో వైద్య, ఆరోగ్య శాఖ వర్గాల్లో గందరగోళం నెలకొంది. మరోవైపు ఈ మందుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు అధికారులతో ఓ కమిటీని నియమించింది.

సంబంధిత రోగి బంధువులు ఎవరైనా చికిత్స పొందుతున్న ఆస్పత్రి డాక్టర్‌ నుంచి ఈ ఇంజెక్షన్‌ కావాలంటూ లిఖిత పూర్వక చీటీతో పాటు, రోగి పూర్తి వివరాలతో ent& mcrm@telangana. gov.inకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తులన్నింటినీ కమిటీ పరిశీలించి.. ఎవరికి అవసరం ఉందో ప్రిస్కిప్షన్‌ ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ కమిటీ సంతృప్తి చెందితే.. వారికి ఆ ఇంజెక్షన్‌ మంజూరు చేస్తూ మెయిల్‌ పంపిస్తారు. ఈ ఇంజెక్షన్‌లు ఏ డిస్ట్రిబ్యూటర్‌ వద్ద లభిస్తాయో మెయిల్‌ లో పేర్కొంటారు. అక్కడికి వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఈ మందులను ప్రభుత్వమే నియంత్రించడం వల్ల బయట ఎక్కడా దొరకని పరిస్థితి నెలకొంది. అయితే ఆస్పత్రులకు వచ్చిన తర్వాత కూడా ఈ మందులను కొందరు బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 

మరిన్ని వార్తలు