ఎస్‌ఐ అవినీతి ‘గట్టు’ 

14 Jan, 2022 05:01 IST|Sakshi

గట్టులో ఇసుక, జూదం అనుమతులకు మామూళ్లు

పోలీస్‌స్టేషన్‌ ఎదుట ట్రాక్టర్ల యజమానుల ఆందోళన 

 విచారణ చేపట్టిన సీఐ 

గట్టు: ఓ ఎస్‌ఐ అవినీతి గుట్టు రట్టయింది. ఇసుక తరలించేందుకు, జాతరలో జూదానికి అనుమతిచ్చేందుకు మామూళ్లు తీసుకున్నారనే వ్యవహారం తాజాగా రచ్చకెక్కింది. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టులో చోటుచేసుకున్న ఈ వ్యవహారంపై సీఐ విచారణ చేపట్టారు. గత నవంబర్‌ 24న గట్టులో జాతర నిర్వహించారు. ఆ సమయంలో జూదానికి అనుమతి ఇవ్వాలంటూ నిర్వాహకులు పోలీస్‌ జీపు డ్రైవర్‌గా పనిచేస్తున్న భీమేష్‌ సాయం కోరారు. దీంతో ఆయన వారి తరఫున ఎస్‌ఐ మంజునాథరెడ్డితో సెటిల్‌మెంట్‌ కోసం ఫోన్‌లో మాట్లాడారు. ఎస్‌ఐ రూ.50వేలు డిమాండ్‌ చేయగా.. రూ.40వేలు ఇస్తానని సదరు డ్రైవర్‌ చెప్పారు. ఈ డబ్బులు పైఅధికారులకు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చుకోవాలో ఎస్‌ఐ వివరించారు. దీనికి సంబంధించిన ఆడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

ఇసుక వ్యవహారంలో.. 
ఇదిలాఉండగా, మండలంలోని ఇందువాసికి చెందిన ఓ ఇసుక ట్రాక్టర్‌ను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. ఇసుక తరలించడానికి ఇది వరకే ఎస్‌ఐకి రూ.20వేలు ఇచ్చానని గ్రామానికి చెందిన నర్సప్ప తెలిపారు. డబ్బులు తీసుకుని తిరిగి పట్టుకోవడాన్ని ఆక్షేపిస్తూ కొంతమంది ట్రాక్టర్ల యజమానులు గురువారం పెద్దఎత్తున పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చి ఆందోళన నిర్వహించారు. ఇసుక తరలింపునకు ప్రత్యేక అనుమతుల పేరుతో ప్రతి నెలా ట్రాక్టర్ల యజమానుల నుంచి మామూళ్లు తీసుకుంటున్నట్లు ఆరోపించారు. అవినీతి పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మొత్తం వ్యవహారం బయటికి రావడంతో గద్వాల సీఐ బాష గట్టు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఎస్‌ఐ మంజునాథరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. భీమేష్‌తోపాటు మరికొందరిని విచారించారు. ఇసుక అనుమతుల వ్యవహారంపైనా ట్రాక్టర్ల యజమానులతో ఆరా తీశారు. ఉన్నతాధికారులకు వసూళ్ల వ్యవహారంతో సంబంధం లేదని బాష చెప్పారు.  

మరిన్ని వార్తలు