‘ఊపిరి’ పోసిన ఎస్‌ఐ

28 Jul, 2022 02:14 IST|Sakshi
సంఘటనా స్థలంలో ఫారూఖ్‌కు  ఊపిరి అందిస్తున్న ఎస్‌ఐ సునీల్‌ 

గుడిహత్నూర్‌ (బోథ్‌): రోడ్డు ప్రమాదానికి గురై అపస్మారక స్థితిలో ఉన్న యువకుడికి నోటిద్వారా శ్వాస అందించి ప్రాణాపాయం నుంచి తప్పించి ప్రశంసలందుకున్నారు ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి ఎస్‌ఐ సునీల్‌. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలివి. ఉట్నూర్‌ మండలం దంతన్‌పల్లి గ్రామానికి చెందిన షేక్‌ ఫారూఖ్‌ బుధవారం ఆదిలాబాద్‌ నుంచి స్వగ్రామానికి మోటార్‌ సైకిల్‌పై వెళ్తున్నాడు. తోషం గ్రామ సమీపంలో మోటార్‌ సైకిల్‌ అదుపు తప్పి కింద పడిపోవడంతో ఫారూఖ్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి.

అదే సమయంలో ఆదిలాబాద్‌ నుంచి ఇంద్రవెల్లి వెళ్తున్న ఎస్‌ఐ సునీల్‌ గమనించి తన వాహనాన్ని ఆపారు. అపస్మారక స్థితిలో ఉన్న ఫారూఖ్‌కు నోటి ద్వారా శ్వాస అందించి ప్రాణాపాయం నుంచి తప్పించారు. అనంతరం క్షతగాత్రుడిని తన వాహనంలో మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి అంబులెన్సులో రిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. ఫారూఖ్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వైద్యులు హైదరాబాద్‌కు తరలించారు. ఎస్‌ఐ సునీల్‌ చేసిన ప్రయత్నాన్ని స్థానికులు, పోలీసులు ప్రశంసించారు.     

మరిన్ని వార్తలు