ఎస్‌ఐ.. మై హీరో ఆఫ్‌ ది డే

15 Sep, 2020 08:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ ‌: ప్రయాణికులుగా ఆటోలో ఎక్కి ఆటోడ్రైవర్‌పై దాడి చేసి దోపిడీకి పాల్పడిన ముగ్గురు దొంగలను గంటల వ్యవధిలోనే అరెస్టు చేసిన బేగంపేట సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌ఐ ఉపేందర్‌యాదవ్‌ను నగర పోలీసు కమిషనర్‌ ప్రశంసించారు. బేగంపేట మయూరిమార్గ్‌ వద్ద ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఓలాకు చెందిన ఓ ఆటోలో ఎక్కిన ముగ్గురు వ్యక్తులు ఆటోడ్రైవర్‌పై దాడి చేసి ఆటో అద్దాలు పగులగొట్టడమే కాకుండా అతని వద్ద ఉన్న రూ.5 వేలను దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు.

దీంతో బాధితుడు వెంటనే 100కు డయల్‌ చేసి పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం ఇచ్చాడు. రాత్రి విధులు నిర్వర్తిస్తున్న ఎస్‌ఐ ఉపేందర్‌యాదవ్‌ పోలీసు కంట్రోల్‌ రూమ్‌ ద్వారా సమాచారం అందుకుని హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటన జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను సేకరించి అప్పటికప్పుడు స్థానికంగా పలువురితో ఏర్పాటుచేసిన గ్రూపులో పోస్టు చేశారు. స్పందించిన స్థానికులు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నిందితులను చూశామని చెప్పడంతో ఎస్‌ఐ ఉపేందర్‌యాదవ్‌ వెళ్ళి విచారించారు. స్థానికంగా రవికిరణ్‌ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు బల్కంపేటలో ఉండే ఇద్దరిని, ఫతేనగర్‌లో ఉండే మరొకరిని పట్టుకున్నారు. దోపిడీకి పాల్పడిన నిందితులను స్వల్ప వ్యవధిలోనే ఎస్‌ఐ ఉపేందర్‌యాదవ్‌ పట్టుకోవడంతో నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ‘మై హీరో ఆఫ్‌ ది డే’ అంటూ ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు.  

మరిన్ని వార్తలు