వేటాడుతూ.. నేలకొరుగుతూ..! 

26 Feb, 2021 13:59 IST|Sakshi

శిల్పం చెబుతున్న కథ!

సిద్దిపేట జిల్లా నర్మెట్ట శివారులో లభించిన వీరగల్లు 

వెయ్యేళ్ల కిందటిదిగా భావిస్తున్న పరిశీలకులు 

సాక్షి, హైదరాబాద్‌: ఓ కథ.. ఓ శిల్పం.. అందులో కథనం.. ఇతివృత్తంలోని ఘట్టాలను వరుసగా పేర్చిన దృశ్య రూపం. పై నుంచి చూస్తూ వస్తే నాలుగు వరుసల్లో దృశ్య మాలిక. రెండు అడుగుల శిల్పం.. ఓ వీరగల్లు కథను చెప్పేసింది. స్పష్టమైన చిత్రాలు.. అవి పలికించిన భావాలు.. అందునా భావోద్వేగాలు. దాదాపు వెయ్యేళ్ల నాటి ఓ అద్భుత శిల్ప సౌందర్యం. చక్రవర్తుల రాచరికపు దర్పం మనకు ఎన్నో శిల్పాల్లో కనిపిస్తుంది. వాటికి సమాంతరంగా వీరగల్లుల వీరోచితం కూడా ప్రస్ఫుటమవుతుంది. యుద్ధంలోనో, వేటలోనో చనిపోయిన వారి పోరాటాన్ని వారి గుర్తుగా శిల్పంలో పాదుకొల్పటం నాటి ఆనవాయితీ. ఈ శిల్పాన్ని వీరగల్లు అంటారు. వారికి గుర్తుగా వేయించిన ఎన్నో శిల్పాలు వెలుగుచూస్తూనే ఉంటాయి. అలా ఓ వీరగల్లు శిల్పం ఇప్పుడు కొత్తగా కనిపించింది. 

తాజాగా దొరికిన శిల్పంలో ఓ కథను చెబుతున్నట్లు నాలుగు వరుసల్లో వేట దృశ్యాలను నిక్షిప్తం చేసిన తీరు ఆకట్టుకుంటోంది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మెట్ట ప్రాంతంలో ఎక్కడ చూసినా అలనాటి చరిత్రకు సాక్ష్యాలు కనిపిస్తూనే ఉంటాయి. ఈ ఊరి పొలిమెరలో ఉన్న శిల్పం తాజాగా వెలుగు చూసింది. దాన్ని ఓ దేవుడి విగ్రహం తరహాలో స్థానికులు ఆరాధిస్తున్నారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్‌ ఇటీవల దాన్ని పరిశీలించి వీరగల్లు శిల్పంగా గుర్తించారు. దాన్ని ఔత్సాహిక పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్‌  పరిశీలించి వీరగల్లుగా నిర్ధారించారు. 

వేటాడుతూ.. నేలకొరుగుతూ..! 
ఓ వీరుడు తన సహాయకులు, వేట కుక్కలతో కలసి వేటకు వెళ్లటం, అడవి పందులను వేటాడే క్రమంలో గాయపడటం, ఆ తర్వాత నేలకొరగటం, అతడిని బతికించాలన్నట్లు ఓ మహిళ (భార్య కావొచ్చు) అమ్మ వారిని వేడుకోవటం, ఆ తర్వాత భటులు అడవి పందులపై విరుచుకుపడి వాటిని వధించటం.. ఇలా వరుసగా చిత్రాలు ఆ శిల్పంలో కనిపిస్తున్నాయి. నాలుగు వరసల్లో ఉన్న ఆ చిత్రాలను చూస్తే ఈ గాథ కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఆ కథకు ఎలాంటి ఆధారం లేకున్నా.. ఆ చిత్రాలు దాన్ని చెబు(చూపు)తున్నాయి. ఆ చిత్రాల్లోని కొన్ని గుర్తులు అవి జైన మతానికి సంబంధించినవన్న అభిప్రాయం కలుగుతోందని, ఈ శిల్పం దాదాపు 11వ శతాబ్దం నాటిది అయి ఉంటుందని హరగోపాల్‌ అంటున్నారు. 

ఈ ప్రాంతంలో జైనం వర్ధిల్లిన దాఖలాలుండటం కూడా దీనికి బలం చేకూరుస్తోందన్నది ఆయన మాట. గతంలో వీరగల్లు శిల్పాలు దొరికినా.. ఇలా ఓ కథ చెబుతున్నట్టు వరుసలుగా చిత్రాలుండటం మాత్రం అరుదేనని పేర్కొన్నారు. గుర్రంపై వేటకు బయల్దేరిన వీరుడు పైవరుసలో దర్పంగా కనిపిస్తున్నాడు. ఆ వెనక ఛత్రం పట్టుకున్న సైనికుడు, కింద వేట కుక్కలు లంఘిస్తున్న తీరు కనిపిస్తున్నాయి. అతడు ఓ పక్కకు ఒరుగుతున్న చిత్రం, ఆ పక్కనే ఓ మహిళ తన ఎడమ చేతిని నడుముపై ఉంచుకుని కుడి చేతితో దేవతకు ఏదో అర్పిస్తున్న చిత్రం, రెండు చేతుల్లో ఫలాలు పట్టుకుని, తలపై సర్పాకృతి ఉన్న దేవత రూపం, పక్కన వేట కుక్క, అడవిపందిపై కుక్క దాడి రెండో వరుసలో ఉన్నాయి. మూడో వరసలో.. చెట్టెక్కిన భటుడు, అతడి పక్కన విల్లంభులతో మరొకరు, ముందు లేడి, దానిపక్కన అడవి పందిపై వేటకుక్కల దాడి చిత్రాలున్నాయి. నాలుగో వరుసలో నాలుగు కుక్కలు ఓ అడవి పందిని చుట్టుముట్టిన చిత్రముంది.   

మరిన్ని వార్తలు