చెత్తతో సేంద్రియ ఎరువు..  మిద్దెతోటలకు ఆదరువు

7 Apr, 2021 18:18 IST|Sakshi

తడి చెత్తతో సేంద్రియ ఎరువు

మిద్దె తోటలకు ఎరువుగా సరఫరా

ప్రత్యేక పంపిణీ కేంద్రాల ఏర్పాటుకు మున్సిపల్‌ యంత్రాంగం ప్రణాళిక

సాక్షి, సిద్దిపేట‌: వినూత్న ప్రక్రియలకు సిద్దిపేట వేదికగా నిలుస్తోంది. కొన్నేళ్లుగా ప్రతి ఇంటి నుంచి సేకరించిన తడి చెత్తను వార్డు స్థాయి ప్రాసెసింగ్‌ యూనిట్లకు తరలించి అక్కడ ఎరువు తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో ఈ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. ఇలా తయారైన ఎరువును పట్టణంలోని మిద్దె తోటల పెంపకందారులకు నామమాత్ర రుసుముతో అందించాలని యోచిస్తోంది. మున్సిపల్‌ ఆలోచనకు సత్ఫలితాలు లభిస్తే భవిష్యత్తులో పట్టణంలో మిద్దె తోటల పెంపకానికి సేంద్రియ ఎరువులు అందుబాటులోకి రానున్నాయి. 

తడి చెత్త సేకరణ, సేంద్రియ ఎరువు తయారీ ఇలా
ఇంట్లో ప్రతిరోజూ మిగిలిపోయిన కూరగాయలు, పూజకు వినియోగించిన పువ్వులు, కుళ్లిన పండ్లు, మిగిలిన అన్నం– కూరలు, మాంస వ్యర్థాలు ఇతరత్రా తడి చెత్త నుంచి సిద్దిపేట మున్సిపల్‌ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా సేంద్రియ ఎరువు తయారు చేసే ప్రక్రియను గతేడాది చేపట్టారు. అందుకు అనుగుణంగానే పట్టణంలోని పాత మాతాశిశు సంక్షేమ కేంద్రం, లింగారెడ్డిపల్లి, మందపల్లి డంప్‌యార్డు, బుస్సాపూర్‌ డంప్‌యార్డులో తడి చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చే ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేశారు.

ప్రతిరోజూ మున్సిపల్‌ సిబ్బంది పట్టణంలోని ఇళ్ల నుంచి 27 మెట్రిక్‌ టన్నుల తడి చెత్తను సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన తడి చెత్తను నాలుగు ప్రాసెసింగ్‌ యూనిట్లకు తరలించి వర్మీ కంపోస్టింగ్‌ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఇలా రోజూ సేకరిస్తున్న తడి చెత్త నుంచి ఆయా ప్రాసెసింగ్‌ యూనిట్లలో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. ఈ లెక్కన రోజూ తొమ్మిది మెట్రిక్‌ టన్నుల తడి చెత్తను ఎరువుగా మార్చుతున్నట్లు మున్సిపల్‌ రికార్డులు చెబుతున్నాయి. 

నాలుగు చోట్ల తయారీ 
స్వచ్ఛ సిద్దిపేట లక్ష్యంగా పట్టణంలో నాలుగు చోట్ల ప్రస్తుతం తడి చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నాం. మంత్రి హరీశ్‌రావు ఆలోచనకు అనుగుణంగా వార్డు స్థాయి ప్రాసెసింగ్‌ యూనిట్లను భవిష్యత్తులో విస్తరించే ఆలోచనలో ఉన్నాం. వార్డులో ప్రజల నుంచి సేకరించిన తడి చెత్తను అదే వార్డులో ఎరువుగా తయారు చేస్తాం. ముందుగా హరితహారం మొక్కలకు, మిద్దె తోటల పెంపకందార్లకు సేంద్రియ ఎరువును పంపిణీ చేస్తాం. 
– రమణాచారి, మున్సిపల్‌ కమిషనర్‌ 

బల్దియా ఆలోచన బాగుంది
మిద్దె తోటలకు తడి చెత్తతో తయారైన సేంద్రియ ఎరువును అందించాలనే మున్సిపల్‌ అధికారుల ఆలోచన మంచిది. ప్రస్తుతం పట్టణాలో మిద్దె తోటల పెంపకంపై ఆసక్తి పెరుగుతోంది. అందుకు అనుగుణంగానే పెద్దసంఖ్యలో మిద్దె తోటల పెంపకం సాగుతోంది. బహిరంగ మార్కెట్లో పది రూపాయలు పెట్టి ఎరువును కొంటున్నాం. మున్సిపల్‌ అధికారులు ఇప్పుడు నామమాత్ర ధరతో ఎరువు పంపిణీ చేస్తే ఉపయోగకరమే. 
– నాగరాజు, మిద్దె తోటల పెంపకదారుడు


మిద్దె తోటలకు సరఫరా దిశగా..
జిల్లా కేంద్రం సిద్దిపేట పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోంది. పట్టణీకరణ పెరుగుతోంది. ప్రజల జీవనశైలి మారుతోంది. తమ అభిరుచులకు అనుగుణంగా బహుళ అంతస్తుల నిర్మాణాలకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. మున్సిపల్‌ రికార్డుల ప్రకారం పట్టణంలో అపార్ట్‌మెంట్‌ల సంస్కృతి 20 శాతం మేరకు పెరిగింది. అదే సమయంలో ఇష్టపడి నిర్మించుకుంటున్న ఇళ్ల పై భాగంలో మిద్దె తోటల పెంపకానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. సిద్దిపేట పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు వంద వరకు మిద్దె తోటలను సంబంధిత గృహ యజమానులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు పట్టణంలో తడి చెత్త ద్వారా తయారైన సేంద్రియ ఎరువును హరితహారం మొక్కలకు, రైతులకు పంపిణీ చేసిన మున్సిపల్‌ అధికారులు ఇక మీదట మిద్దె తోటలకు సేంద్రియ ఎరువును సరఫరా చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు సమాచారం.


అందుకు అనుగుణంగానే ప్రతిరోజూ తొమ్మిది మెట్రిక్‌ టన్నుల తడి చెత్త ద్వారా ఉత్పత్తి అవుతున్న సేంద్రియ ఎరువును మిద్దె తోటలతో పాటు హరితహారం కింద పెంచే మొక్కలకు అందించాలని మున్సిపల్‌ యంత్రాంగం నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే పట్టణంలో ప్రాసెసింగ్‌ యూనిట్ల వద్ద ప్రత్యేకంగా సేంద్రియ ఎరువు పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసి మిద్దె తోటల యజమానులను చైతన్యం చేసే దిశగా మున్సిపల్‌ యంత్రాంగం ప్రణాళిక రూపకల్పనలో నిమగ్నమైంది. నామమాత్ర రుసుముతో సేంద్రియ ఎరువును విక్రయించడం ద్వారా తడి చెత్త సమస్య పరిష్కారంతో పాటు బల్దియాకు ఆదాయపరంగానూ కలిసొచ్చేలా ద్విముఖ వ్యూహంతో మున్సిపల్‌ అధికారులు ముందుకు సాగుతున్నారు.  

ఇక్కడ చదవండి:
మీకిస్తే సరిపోతుందా .. పొట్టు పొట్టు జేస్తా:  మంత్రి మల్లారెడ్డి ఆడియో

కరోనా సెకండ్‌ వేవ్‌‌: రానున్న మూడు నెలలూ గడ్డురోజులే!

మరిన్ని వార్తలు