ఆన్‌లైన్‌ అవస్థలు; ఓసారూ.. సిగ్నలత్తలేదు!

3 Jul, 2021 07:37 IST|Sakshi

ఒకవైపు ఆన్‌క్లాస్‌ల భారం.. మరొక వైపు మొబైల్‌ సిగ్నల్స్‌ ఏమో ఊరికి దూరం.. ఇది పల్లెల్లో పరిస్థితి. కరోనా కారణంగా ఆన్‌క్లాస్‌లు నిర్వహిస్తుంటే అదేమో సగం సగం అన్నట్లే ఉంది. ఆన్‌లైన్‌ క్లాస్‌ల్లో బోధించేది ఎంతవరకూ ఒంట పడుతుందో తెలీదు కానీ, మొబైల్‌ సిగ్నల్స్‌ మాత్రం విద్యార్థుల్ని పరేషాన్‌ చేస్తున్నాయి.  సిగ్నల్‌ దొరక్కపోవడంతో ‘ ఓసారూ.. నో సిగ్నల్‌’ అనడమే వారి నోట మాట అవుతుంది. ఆ మాట ఆ సారుకి చేరుతుందో లేదో తెలీదు కానీ ఆన్‌లైన్‌ క్లాస్‌లు మాత్రం అటకెక్కిపోతున్నాయనడానికి ఇదొక ఉదాహరణ.

సాక్షి, ఆదిలాబాద్‌ : ఒకచేత పుస్తకాలు.. మరోచేత సెల్‌ఫోన్లతో కుస్తీపడుతున్న వీరంతా ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం లోహర గ్రామానికి చెందిన విద్యార్థులు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమైన విషయం తెలిసిందే. లోహర గ్రామంలో సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ అందకపోవడంతో.. ఇదిగో ఇలా ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలోని సిగ్నల్‌ అందే గుట్టపైకి వెళ్లి పాఠాలు వింటూ కనిపించారీ విద్యార్థులు.

ఆన్‌లైన్‌ అభ్యసనం ఎలా సాగుతుందో శుక్రవారం పరిశీలించడానికి వెళ్లినపుడు ఈ దృశ్యం ‘సాక్షి’ కంటబడింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన నార్నూర్, గాదిగూడ, ఇంద్రవెల్లి, ఆదిలాబాద్‌ రూరల్, సిరికొండ, బోథ్, బజార్‌హత్నూర్, తలమడుగు, కుమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలోని జైనూర్, లింగాపూర్, సిర్పూర్‌(యు), తిర్యాని, బెజ్జూర్, కౌటాల, పెంబీ, దస్తురాబాద్, కడెం, కోటపెల్లి, వేమన్‌పెల్లి, దండేపల్లిలోనూ ‘సిగ్నల్‌ దొరికేనా.. పాఠం వినేనా?’ అన్నట్టు పరిస్థితి ఉంది.

 

మరిన్ని వార్తలు