టీఆర్‌ఎస్‌లో సైలెంట్‌ వార్‌

16 Dec, 2020 18:52 IST|Sakshi

వికారాబాద్‌: స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కొండల్‌రెడ్డి మధ్య కొనసాగుతున్ను గ్రూపు తగాదాలు మంత్రి సబితారెడ్డి ముందు మరోమారు బహిర్గతమయ్యాయి. పట్టణంలోని లైబ్రరీ ఆవరణలో రూ.కోటితో నిర్మించనున్న రీడింగ్‌ భవన నిర్మాణ శంకుస్థాపనకు జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే స్థానిక ఎమ్మెల్యే ఆనంద్‌ వర్గీయులు ఎవరూ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కొంత కాలంగా మర్పల్లి మండలంలో ఎమ్మెల్యే ఆనంద్, కొడంల్‌రెడ్డి వర్గాలు రెండుగా విడిపోయారు. రెండు నెలల క్రితం మర్పల్లిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఎదుటే కొంతమంది ప్రజాప్రతినిధులు వేదిక కింద కూర్చుని ఎమ్మెల్యే తీరుపై నిరసన చేశారు.

దీంతో ఎమ్మెల్యే, కొండల్‌రెడ్డి వర్గాల మధ్య మరింత గ్యాప్‌ పెరిగింది. ఎమ్మెల్యే ఆనంద్‌ ఎక్కడికి వెళ్లినా ఆయన వెన్నంటి ఉండే ద్వితీయశ్రేణి నాయకులెవరూ గ్రంథాలయం వద్ద జరిగిన శంకుస్థాపనకు హాజరు కాలేదు. ఈ విషయాన్ని ముందే గ్రహించిన కొండల్‌రెడ్డి తన సొంత మండలమైన మర్పల్లి నుంచి పెద్దఎత్తున అనుచరులను రప్పించారు. సుమారు వంద తుఫాన్‌ వాహనాల్లో కార్యకర్తలను తెప్పించుకుని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. 

మరిన్ని వార్తలు