దశాబ్దం కల సాకారమైన వేళ

1 Aug, 2022 03:48 IST|Sakshi
ఉద్యోగ పత్రాలు అందుకునేందుకు వచ్చిన గిరిజనులు  

నాలుగు ఉమ్మడి జిల్లాల గిరిజన యువతకు సింగరేణిలో ఉద్యోగాలు 

309 మందికి నియామక పత్రాలు అందజేత  

న్యాయపరమైన చిక్కులు అధిగమించాం: డైరెక్టర్‌ బలరాం

గోదావరిఖని: సింగరేణి పరిధిలోని గిరిజన ప్రాంతాల యువత జీవితాల్లో వెలుగులు నిండాయి. సుదీర్ఘ పోరాటం తర్వాత నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని 665 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సింగరేణి సంస్థ యాజమాన్యం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వీరిలో 309 మంది యువకులకు ఆదివారం ఉద్యోగ పత్రాలను అందించింది. సింగరేణి గనుల విస్తరణతో భూములు, ఇళ్లు కోల్పోయిన గిరిజనులను సంస్థ యాజమాన్యం ఆదుకోవాలని దశాబ్దకాలంగా పోరాటం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో నిర్వాసిత గ్రామాల గిరిజన యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన యాజమాన్యం 2018లో రాత పరీక్ష నిర్వహించింది. ఆ తర్వాత కొంతమంది దీనికి వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లడంతో ఫలితాలు వెల్లడించకుండా నిలిపివేసింది. కాగా, గిరిజన యువతకు ఉద్యోగాలివ్వాలని హైకోర్టు కూడా 27 డిసెంబర్‌ 2021న సంస్థను ఆదేశించింది.

ఈ క్రమంలో కొన్ని న్యాయపరమైన చిక్కులు ఏర్పడగా.. కోల్‌బెల్ట్‌ప్రాంత అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సంస్థ సీఎండీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేలా చేశారు. దీంతో సమస్యలను పరిష్కరించి ఇటీవల పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలో 665 మంది ఎంపికయ్యారు. వీరిలో ఆదివారం ఒక్కరోజే 309 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. దశలవారీగా మిగతా వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు సంగరేణి వర్గాలు తెలిపాయి. తమ పోరాటం ఫలించిందని, దశాబ్దాల కల నెరవేరిందని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల గిరిజన ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

కూలీ చేస్తూ బతుకుతున్నా..
సింగరేణి ఉద్యోగం రావ డం సంతోషంగా ఉంది. డిగ్రీ చదివినా ఉద్యోగం లేక కూలీ పనిచేసుకుంటున్న. 2018లో సింగరేణిలో పరీక్ష రాశా. గిరిజనులకు ఉద్యోగాలను ప్రకటించడం ఆనందంగా ఉంది.     
– మూడు రఘు, చౌడవరంతండా, సత్తుపల్లి 

సంతోషంగా ఉంది 
మాది పేద కుటుంబం. బీ ఫార్మసీ పూర్తి చేశా. కానిస్టేబుల్, ఎస్సై, గ్రూప్స్‌కు హాజరైనా ఉద్యోగం రాలే దు. సింగరేణి పరీక్షలో పాల్గొన్నా. ఫలితాలు ఆలస్యమైనా, సంస్థలో ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది.      
– లూనావత్‌ రమేశ్, నర్సింహులపేట, మహబూబాబాద్‌ 

ఊహించలేదు..  
సింగరేణిలో ఉద్యోగం వస్తుందని కలలో కూడా ఊహించలేదు. కొందరు కోర్టుకు వెళ్లడంతో ఫలితాలు పెండింగ్‌లో పె ట్టారు. ఉద్యోగం రావడం మర్చిపో లేని రోజు. 
– ఇస్లావత్‌ రాజ్‌కుమార్, రాజీవ్‌నగర్‌తండా, యైటింక్లయిన్‌కాలనీ 

చిక్కులు అధిగమించి 
గిరిజన యువతకు ఉద్యోగాలిచ్చే విషయంలో అనేక న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాం. సంస్థ సీఎండీ శ్రీధర్‌ ఆదేశాల మేరకు ఇబ్బందులను అధిగమించి 309 మందికి ఒకేరోజు ఉద్యోగాలివ్వ డం సంతృప్తినిచ్చింది. మిగతా వారికి కూడా దశల వారీగా ఉద్యోగాలిస్తాం.
 – బలరాంనాయక్, డైరెక్టర్, సింగరేణి 

మరిన్ని వార్తలు