వేడిజలం వెలుగులీను!

30 Jul, 2022 04:21 IST|Sakshi
మణుగూరు మండలం పడిగేరులో బోర్ల నుంచి వస్తున్న వేడి నీరు

జియోథర్మల్‌ పవర్‌ ఉత్పత్తికి సింగరేణి కసరత్తు 

కొత్త ప్రయోగానికి శ్రీకారం..

సిద్ధమైన ప్రోటోటైప్‌ మోడల్‌ ఖర్చూ, కాలుష్యమూ తక్కువే.. 

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి సంస్థ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సరికొత్త వెలుగుల సృష్టికి సన్నద్ధమవుతోంది. తొలిసారిగా జియోథర్మల్‌ పవర్‌ప్లాంట్‌ స్థాపనకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు ప్రోటోటైప్‌ ప్రయోగాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను వేదికగా చేసుకుంది. ఒకటి, రెండు నెలల్లో ఈ ప్రయోగం కొలిక్కి వస్తుందని సింగరేణి భావిస్తోంది.

సంప్రదాయ థర్మల్, హైడల్‌ సిస్టమ్‌లో ఇప్పటికే విద్యుదుత్పత్తి జరుగుతోంది. థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుల్లో బొగ్గును మండించి సృష్టించే నీటిఆవిరి టర్బయిన్లను తిప్పడం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. జలవిద్యుత్‌ కేంద్రాల్లో వేగంగా ప్రవహించే నీరు టర్బయిన్లను తిప్పడం ద్వారా విద్యుదుత్పత్తి జరుగుతుంది. కానీ, జియో థర్మల్‌పవర్‌ ప్రాజెక్టులో మాత్రం వేడినీరు విద్యుత్‌ ఉత్పత్తికి ప్రధాన ఇంధన వనరుగా మారనుంది. 

30 ఏళ్ల కిందటే 
భూగర్భపొరల్లో జరిగే భౌతిక, రసాయనిక చర్యల కారణంగా అరుదుగా అక్కడక్కడా భూగర్భ­జలాలు చాలావేడిగా ఉంటాయి. వీటి ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేయొచ్చని 30 ఏళ్ల క్రితం అధికారులు అంచనా వేసి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సింగరేణి ఎక్స్‌ప్లోరేషన్‌ విభాగం మణుగూరు ప్రాంతంలో 1989లో బొగ్గు అన్వేషణ చేప­ట్టి వేడి భూగర్భజలాలను కనుగొంది. జియో థర్మల్‌ పద్ధతిలో తేలికగా విద్యుదుత్ప­త్తి చేయడానికి భూగర్భజలాల ఉష్ణోగ్రత 140 సెల్సియస్‌ డిగ్రీలకుపైగా ఉండాలి.

కానీ, మణుగూరు దగ్గర వెలుగులోకి వచ్చిన వేడి భూగర్భజలాల ఉష్ణోగ్రత 67 సెల్సియస్‌ డిగ్రీలు మాత్రమే నమోదైంది. దీంతో అప్పటి నుంచి జియో థర్మల్‌ ప్లాంట్‌ పనులు ముందుకు సాగలేదు. ఇటీవల జియోథర్మల్‌ పవర్‌ టెక్నాలజీలో అనేక మార్పులు వచ్చాయి. ఫ్లాష్‌ స్ట్రీమ్‌ ప్లాంట్లు, బైనరీ సైకిల్‌ పవర్‌ ప్లాంట్ల టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఈ టెక్నాలజీలో తక్కువ ఉష్ణోగ్రత ఉన్న భూగర్భజలాలకు ఇతర ద్రావకాలను జతచేయడం ద్వారా వేడి ఆవిరిని సృష్టించే వీలుంది. ఈ వేడి ఆవిరి ద్వారా టర్బయిన్లు తిప్పుతూ విద్యుత్‌ ఉత్పత్తి చేయడం సాధ్యమవుతుంది. 

రెండేళ్ల శ్రమ 
బైనరీ సైకిల్‌ ప్లాంట్‌ ద్వారా జియో థర్మల్‌పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటు కోసం సింగరేణి సంస్థ రెండేళ్ల క్రితం కేంద్రానికి లేఖ రాసింది. దీంతో జియో థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుపై ప్రయోగాలు చేయడానికి కేంద్రం రూ.1.72 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో సింగరేణి సంస్థ, సెంట్రల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, శ్రీరాం ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇండస్ట్రీస్‌ సంస్థలు సంయుక్తంగా మణుగూరు మండలం పడిగేరు వద్ద పనులు చేపట్టాయి. 

ఇటలీలో 20వ శతాబ్దంలోనే... 
ప్రపంచంలో తొలి జియో థర్మల్‌పవర్‌ ప్లాంట్‌ను 20వ శతాబ్దం ఆరంభంలో ఇటలీలోని టస్కనీలో ప్రారంభించారు. అక్కడ నీటి అడుగు భాగం నుంచి వేడి నీటి ఆవిరి ఉబికి వస్తుండటంతో తొలిసారిగా జియో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. ప్రపంచంలో జియో థర్మల్‌ ఎనర్జీని ఇరవైకి పైగా దేశాల్లో ఉత్పత్తి చేస్తున్నారు. అత్యధికంగా ఈ విధానంలో అమెరికాలో విద్యుదుత్పత్తి జరుగుతోంది. 

తొలిసారిగా లఢక్‌లో..
ఇండియాలో తొలి ప్రాజెక్టును 2021 ఫిబ్రవరిలో లఢక్‌లోని పుగాలో ఓఎన్‌జీసీ ఈ చేపట్టింది. ఇక తాతాపాని(ఛత్తీస్‌గఢ్‌), మాణికరన్‌(హిమాచల్‌ప్రదేశ్‌), బక్రేశ్వర్‌(పశ్చిమబెంగాల్‌), తువా(గుజరాత్‌), ఉనాయ్‌(మహారాష్ట్ర), జల్‌గావ్‌(మహారాష్ట్ర), రాజ్‌గోర్, ముంగేర్‌(బిహార్‌), గోదావరి – ప్రాణహిత లోయ మణుగూరు(తెలంగాణ)లో జియో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ స్థాపనకు అవకాశాలు ఉన్నాయి. 

జియో థర్మల్‌పవర్‌ తయారీ ఇలా
ప్రస్తుతం సిద్ధం చేసిన ప్రొటోటైప్‌ జియో థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లో వేడి భూ గర్భజలాలను ప్రత్యేకంగా తయారు చేసిన ఓ చాంబర్‌లోకి పంపిస్తారు. ఇందులో ఆర్గానిక్‌ ర్యాంకైన్‌ అనే ప్రత్యేకమైన ద్రావకాన్ని ఉంచుతారు. నీటి వేడితో ఈ ఆర్గానిక్‌ ర్యాంకైన్‌ అనే పదార్థం ఆవిరిగా మారుతుంది. ఈ ఆవిరిని టర్బయిన్లు ఉండే చాంబర్‌లోకి పంపిస్తారు. టర్బయిన్లను ఆవిరి తిప్పడం ద్వారా విద్యుత్‌ ఉ­త్ప­త్తి జరుగుతుంది. టర్బయిన్లు తిప్పిన ఆవిరిని తిరిగి కూలింగ్‌ చాంబర్‌లోకి పంపిస్తారు. అక్కడ చల్లబడిన ఆర్గానిక్‌ ర్యాంకైన్‌ సబ్‌స్టాన్స్‌ను తిరిగి ఉపయోగిస్తారు.

ఈ మొత్తం ప్రాజెక్టును ‘క్లోజ్డ్‌ లూప్‌ బైనరీ డ్రైజెట్‌ ఆర్గానిక్‌ ర్యాంకైన్‌ సైకిల్‌ ప్రాసెస్‌ టెక్నాలజీ’గా పేర్కొంటున్నారు. ఈ విధానంలో వాతావరణ కాలుష్యం పరిమితంగా ఉంటుంది. బొగ్గును మండించాల్సిన అవసరం లేదు. దీంతో ఖర్చు కూడా తగ్గుతుంది. ర్యాంకైన్‌ సబ్‌స్టాన్స్‌ను మాత్రమే రీచార్జ్‌ చేయాల్సి ఉంటుంది. పడిగేరు వద్ద 20 కిలోవాట్స్‌ సామర్థ్యంతో ప్రస్తు తం ప్రోటోటైప్‌ ప్రాజెక్టు సిద్ధమైంది. వచ్చే రెండు, మూడు నెలల్లో విద్యుత్‌ ఉత్పత్తి ప్రయోగాలు జరగనున్నాయి.   

మరిన్ని వార్తలు