సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల సమ్మె 

10 Sep, 2022 02:21 IST|Sakshi
ఆర్జీ–1 జీఎం ఆఫీస్‌ ఎదుట ధర్నా చేస్తున్న కార్మికులు 

11 ఏరియాల్లో విధులు బహిష్కరించిన కార్మికులు  

నిరసన ప్రదర్శనలు నిర్వహించిన కార్మిక సంఘాలు

గోదావరిఖని (రామగుండం)/సింగరేణి(కొత్తగూడెం): తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం సింగరేణి కాంట్రాక్టు కార్మికులు సమ్మెకు దిగారు. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లోని కార్మికులు విధులు బహిష్కరించారు. మరోమూడు రోజుల తర్వాత సమావేశం ఏర్పాటు చేస్తామని.. సమ్మె యోచన విరమించాలని యాజమాన్యం గురువారం కోరినా కాంట్రాక్టు కార్మిక సంఘాలు ససేమిరా అన్నాయి.

సింగరేణి వ్యాప్తంగా సుమారు 23 వేల మంది కాంట్రాక్టు కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, భూపాలపల్లి, ఆర్జీ–1,2,3, ఏపీఏ, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల్లో కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో పలు విభాగాల్లో పనులు నిలిచిపోయాయి. అత్యవసర విభాగాల్లో మాత్రం పనులు కొనసాగాయి.  

డిమాండ్లు నెరవేర్చేవరకు సమ్మె.. 
పర్మనెంట్‌ కార్మికులతో సమానంగా పనిచేస్తున్న తమను యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం స్పందించి డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాంట్రాక్టు కార్మికుల వేతనాలు 30 శాతం పెంచాలని, సీఎంపీఎఫ్‌ అమలు చేయాలని, లాభాల్లో వాటా ఇవ్వాలి, కార్మికశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న అన్నీ సమస్యలు పరిష్కరించాలని, కేటగిరీ ఆధారంగా జీతాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా గోదావరిఖని, రామగుండం, కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద వివిధ రూపాల్లో కార్మికులు నిరసన వ్యక్తంచేశారు. భూపాలపల్లిలో రాస్తారోకో, మణుగూరులో ర్యాలీ, సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ నాయకులు, హెచ్‌ఎంఎస్, ఐఎన్‌టీయూసీ, బీఎంఎస్‌ సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు