వంద మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తే లక్ష్యం

30 Sep, 2020 09:27 IST|Sakshi

సాక్షి, సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో రానున్న నాలుగేళ్లలో ప్రస్తుతం సాధిస్తున్న 65 మిలియన్‌ టన్నుల బొగ్గు లక్ష్యాన్ని 100 మిలియన్‌ టన్నులు సాధించేందుకు అధికారులు, కార్మికులు సమిష్టిగా సాధించేందుకు కృషి చేస్తానని సింగరేణి సంస్థ నూతన డైరెక్టర్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ మెకానిక్‌ (ఈఅండ్‌ఎం) దొగ్గ సత్యనారాయణరావు తెలిపారు. డైరెక్టర్‌ ఈఅండ్‌ఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2015లో సింగరేణిలో సీఅండ్‌ఎండీగా శ్రీధర్‌ బాధ్యతలు చేపట్టిన తరువాత సంస్థను అభివృద్ధిలోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఆయన సూచనలు, సలహాలతో రూ.490 కోట్ల లాభాల్లో ఉన్న సింగరేణి అయిదేళ్లలో రూ.1700 కోట్ల ఆదాయాన్ని సాధించినట్లు తెలిపారు. వాటిలో రూ.కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల రూపంలో చెల్లించటమే కాకుండా కార్మికులకు 28శాతం వాటా కింద రూ.494 కోట్లను చెల్లించటం జరిగిందన్నారు. దీనిలో సీఅండ్‌ఎండీ పాత్ర కీలకం అన్నారు.

బొగ్గు ఉత్పత్తి, రవాణాలో వివిధ రాష్ట్రాల్లో బొగ్గు పరిశ్రమలతోపాటు మహారత్న కంపెనీలకు దీటుగా పనిచేసి పలువురి ప్రశంసలు పొందిందన్నారు. ఇటువంటి సంస్థలో తనకు డైరెక్టర్‌గా అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇప్పటిì వరకు బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామిగా విరాజిల్లుత్ను సింగరేణి.... విద్యుత్‌ రంగంతో పాటు సోలార్‌ పవర్‌లో తనవంతు సత్తాను చూపనుందని, ఇందుకోసం మూడు స్టేజీలలో సింగరేణి వ్యాప్తంగా వివిధ ఏరియాల్లో దశలవారీగా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, దానిలో భాగంగా నవంబర్‌ నాటికి మొదటి దశ పనులు పూర్తై సింక్రనైజేషన్‌ అవుతుందని ఆకాంక్షించారు.

మిగతా రెండు దశల పనులు కూడా రానున్న రెండేళ్లలో పూర్తికానున్నామయని వివరించారు. కరోనా వైరస్‌ వచ్చిన తరువాత దేశం 23.4 శాతం అభివృద్ధిలో వెనుకంజలో ఉన్నట్లు ఆర్థికవేత్తలు ప్రకటించారని, ఈ ప్రభావం సింగరేణిపై కూడా పడిందని చెప్పారు. ఈక్రమంలో సంస్థ సుమారు 17 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి వెనుకంజలో ఉందని, ఈ నష్టాన్ని తోటి డైరెక్టర్లు , కిందిస్థాయి ఉద్యోగులతో చర్చించి బ్యాలెన్స్‌ చేసేందుకు తనవంతు సహాయ సహకారాలు అందిస్థానన్నారు. బొగ్గు అక్రమ రవాణాను అరికట్టేందుకు వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ (వీటీఎస్‌) విధానాన్ని బలోపేతం చేసి నిఘా వ్యవస్దను పటిష్టం చేయనున్నట్లు చెప్పారు. సత్తుపల్లి–కొత్తగూడెం రైల్వేలైన్‌ పనులను వేగవం తం చేసి, బొగ్గు లారీల ద్వారా జరిగే ప్రమాదాలను నివారింపజేస్తామన్నారు.

ఉత్పత్తి పెంచాలి..
ఇల్లెందు: సింగరేణి నూతన డైరెక్టర్‌ (ఈఅండ్‌ఎం) గా బాధ్యతలు చేపట్టిన డి.సత్యనారాయణ సింగరేణి పుట్టినిల్లైన ఇల్లెందు ఏరియాలో మంగళవారం పర్యటించారు. ఏరియా జీఎం పి.వి. సత్యనారాయణ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం డైరెక్టర్‌ మాట్లాడుతూ ఏరియాలో ఉత్పత్తి, ఉత్పాదకత పెంచాలన్నారు. కోవిడ్‌ దృష్ట్యా బొగ్గు కొనుగోలు కొంత తగ్గినా ఇప్పుడు బొగ్గుకు డిమాండ్‌ పెరుగుతుందని, ఉత్పత్తితో పాటు రవాణాను కూడా పెంచాలని సూచించారు.  అనంతరం జేకేఓసీ సమీపంలోని సోలార్‌ ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించారు. ఆయన వెంట అధికారులు జానకిరామ్, సీహెచ్‌. లక్ష్మీనారాయణ, నర్సింహరావు ఉన్నారు.

మళ్లీ అవాంతరం

  • ‘కేటీపీఎస్‌’లో నిలిచిన విద్యుత్‌ ఉత్పత్తి

పాల్వంచ: కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌)5 దశ కర్మాగారంలో విద్యుత్‌ ఉత్పత్తికి అవాంతరం ఏర్పడుతోంది. బీహెచ్‌ఈఎల్‌ ఆధ్వర్యంలో 250 మెగవాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 9వ యూనిట్‌లో ఆధునికీకరణ ముగిసి, సింక్రనైజేషన్‌ చేసినప్పటికీ చిక్కులు వీడట్లేదు. ఉత్పత్తి తరచూ నిలిచిపోతుందడటంతో జెన్‌కో సంస్థకు కోట్లాది రుపాయల నష్టం ఏర్పడుతోంది. నాలుగు రోజుల కిందట కర్మాగారంలో అధిక వైబ్రేషన్స్‌(ప్రకంపనలు) రావడంతో ఉత్పత్తిని నిలిపివేశారు. బీహెచ్‌ఈఎల్‌ సంస్థకు సమాచారం అందించి మరోమారు మరమ్మతులు చేపట్టారు. 5వ దశ కర్మాగారంలోని 9, 10యూనిట్ల ఆధునికీకరణ పనులను గత జూన్‌ 8వ తేదీన చేపట్టారు.

వివిధ రాష్ట్రాలకు చెందిన వందలాది మంది టెక్నీషియన్లతో యుద్ధ ప్రాతిపదికన పనులు చేసి గత ఆగష్టు 12న సింక్రనైజేషన్‌ చేసి ఉత్పత్తిని రాష్ట్ర గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. అయితే టర్బైన్‌లో సాంకేతిక సమస్యతో ఉత్పత్తి పలుమార్లు నిలిచింది. తాజాగా బేరింగ్‌లు మార్చేందుకు భూపాలపల్లిలోని కేటీపీపీ నుంచి తెప్పించారు. మంగళవారం 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 10వ యూనిట్‌లో బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజీ ఏర్పడి యూనిట్‌ను నిలిపివేశారు. మొత్తంగా 500 మెగావాట్ల ఉత్పత్తి ఆగింది. 

త్వరలోనే అందుబాటులోకి..
9వ యూనిట్‌లో అధిక ప్రకంపనల కారణంగా బీహెచ్‌ఈఎల్‌ సంస్థ టెక్నీషియన్ల ద్వారా మరమ్మత్తులు చేయిస్తున్నాం. ఆధునికీకరణ తర్వాత కొన్ని కారణాలతో సమస్యలు వస్తున్నాయి. వాటిని పరిష్కరిస్తే ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవు. – కె.రవీంద్ర కుమార్, సీఈ, కేటీపీఎస్‌ 5,6 దశలు

మరిన్ని వార్తలు