అడవి నవ్వింది...

7 Dec, 2020 09:04 IST|Sakshi

పచ్చగా కళకళలాడుతున్నసింగాయపల్లి అడవి

అధ్యయన కేంద్రంగా మారిన అటవీ ప్రాంతం

పేరుకే అడవి.. తీరుచూస్తే ఎడారి.. పాడుబడిన బీడు భూమిని తలపిస్తూ చుట్టూ ఒక్క చెట్టూ కనిపించేది కాదు.. దాదాపు నాలుగేళ్ల క్రితం వరకు సింగాయపల్లి అటవీ ‘దృశ్య’మిది. అక్కడ మళ్లీ అడవికి పునరుజ్జీవం పోయాలనే ఆలోచనకు బీజం పడి, కార్యాచరణ మొలకెత్తి.. పచ్చని చిట్టడవి రూపుదిద్దుకుంది. పిచ్చి మొక్కలన్నీ పోయి.. పూల, ఫల, ఔషధ, ఇతర వృక్షాలతో ఇప్పుడు సింగాయపల్లి అడవి పచ్చదనాన్ని సింగారించుకుని పచ్చగా నవ్వుతోంది.

సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలో 66.48 లక్షల ఎకరాల అటవీ భూమి ఉంది. ఇది రాష్ట్ర భూభాగంలో 23.4 శాతం. అయితే ఇంత అటవీభూమి ఉన్నా అదే నిష్పత్తిలో అడవుల్లేవు. ఒక అంచనా ప్రకారం రాష్ట్రంలో కేవలం 14 శాతం మేరకే దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ క్రమంలో అడవుల పరిరక్షణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎం తన సొంత నియోజకవర్గంలోని సింగాయపల్లి అడవిని మోడల్‌గా తీసుకుని ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఫలితంగా నాలుగేళ్లకే 157 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ముళ్లకంపల ప్రాంతాన్ని మహా అడవిగా మార్చారు. పునరుజ్జీవం పోసుకున్న ఈ అడవిని 2019 ఆగస్టు 21న సీఎం కేసీఆర్‌ సందర్శించారు. అనంతరం 2020 ఫిబ్రవరి 18న మంత్రులు, మున్సిపల్‌ చైర్మన్లు, అదే ఏడాది అక్టోబర్‌ 16న ఐఏఎస్‌లు, సీఎస్, నవంబర్‌ 18న డీజీపీ, పలువురు ఐపీఎస్‌ అధికారులు ఈ అడవికి అధ్యయనం నిమిత్తం వచ్చారు.  

ఏఎన్‌ఆర్‌తో పునరుజ్జీవం
ఏఎన్‌ఆర్‌ కార్యక్రమం ద్వారా సింగాయపల్లి అడవికి జీవం పోశాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనకు కార్యరూపం దాల్చి ఈ అడవి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచింది. 
– శ్రీధర్‌రావు,  సిద్దిపేట డీఎఫ్‌ఓ 

పునరుజ్జీవం–సంరక్షణ ఇలా..
ఏఎన్నార్‌: సింగాయపల్లి అడవిని పునరుద్ధరించే లక్ష్యంతో 2017లో అసిస్టెడ్‌ నేచురల్‌ రీజనరేషన్‌(ఏఎన్‌ఆర్‌) కార్యక్రమం చేపట్టారు.  కొత్తగా మొక్కలు నాటి, విత్తనాలు చల్లి సహజంగా పెరిగే వాతావరణాన్ని సృష్టించారు.

కల్చరల్‌ ఆపరేషన్‌ : చెట్లకు అడ్డుగా నిలిచే పిచ్చిమొక్కల్ని, లంబడి, గోరంత వంటి ముళ్ల రకం మొక్కలను, వృక్షాలు ఎదగకుండా అల్లుకుపోయిన తీగలను తొలగిస్తారు.
‘సింగిలింగ్‌’ పనులు ఒకేచోట ఎక్కువగా ఉన్న చెట్లలో ఒకటి, రెండింటిని నరికేసి మిగతావి బలంగా, దృఢంగా పెరిగేలా చూడటమే ‘సింగిలింగ్‌’.

కాపిసింగ్‌ : నరికివేతకు గురై మోడుబారిన వృక్షాల మొదళ్లను భూమి వరకు నరికేసి సహజంగా తిరిగి చిగురించేలా చేయడం..

క్యాంప్‌ కూలీలు :అటవీ పునరుజ్జీవ పనులకు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, భద్రాచలం ప్రాంతాల నుంచి ‘క్యాంపు’ కూలీ లను పిలిపించారు. ప్రతి హెక్టారుకు రూ.6,200 చొప్పున వీరికి చెల్లించారు.

మంకీ ఫుడ్‌ కోర్టులు : సింగాయపల్లి అడవిలో 25 రకాలకుపైగా పం డ్ల మొక్కలను పెంచుతున్నారు. కోతులు ఊళ్లపై పడకుండా ఇవి మంకీ ఫుడ్‌ కోర్టుల్లా మారుతున్నాయి.

మియావాకి :  సింగాయపల్లి అడవిలో ఖాళీ ప్రదేశాలను చిట్టడవిగా మార్చేలా 50 వేల మొక్కల్ని మియావాకి విధానంలో మొక్కలు నాటారు.  

కందకాలు :  సహజసిద్ధ సింగాయపల్లి అడవి చుట్టూ చుట్టూ కందకాలు తవ్విం చారు. పశువులు చొరబడకుండా, అడవి నరికివేతకు గురికాకుండా ఇవి దోహదపడుతున్నాయి.

ఫైర్‌లైన్లు : అటవీప్రాంతంలో అగ్ని ప్రమాదాల నివారణకు రాజీవ్‌ రహదారి పక్క నుంచి అడవి వరకు 3 – 5 మీ. వెడల్పుతో ఫైర్‌లైన్లు ఏర్పాటు చేశారు. ఈ లైన్‌లో చెత్తా చెదారాలను ఎప్పటికప్పుడు తొలగిస్తారు. 

మరిన్ని వార్తలు