ఆసియాలోనే పెద్ద మార్కెట్‌

2 Aug, 2022 04:00 IST|Sakshi

రూ.400 కోట్లకు పైగా ఖర్చుతో కోహెడలో నిర్మాణం 

వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ఆసియాలోనే అత్యంత పెద్దదిగా కోహెడ మార్కెట్‌ నిర్మాణం చేపడుతున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. అందుకోసం రూ. 400 కోట్లకు పైగా ఖర్చు చేస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు మంత్రుల నివాస సముదాయంలో సోమవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 178 ఎకరాల్లో కోహెడ మార్కెట్‌ను నిర్మించాలని నిర్ణయించామన్నారు. 41.57 ఎకరాల్లో షెడ్ల నిర్మాణం, 39.70 ఎకరాల్లో 681 కమీషన్‌ ఏజెంట్ల దుకాణాలు, 19.71 ఎకరాల్లో కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణం, 45 ఎకరాల్లో రహదారుల నిర్మాణం, 24.44 ఎకరాల్లో పార్కింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు. మాస్టర్‌ లే ఔట్, ఇంజనీరింగ్‌ డిజైన్స్‌ ఎస్టిమేట్లకు వయాంట్స్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (గుర్గావ్‌)కు టెండర్‌ అప్పగించామన్నారు.

నమూనా లే ఔట్లపై కంపెనీతో పలుమార్లు చర్చలు జరిపామని, సోమవారం రెండు లే ఔట్లను పరిశీలించి, మార్పులు చేర్పులకు ఆదేశించినట్లు తెలిపారు. సీఎం పరిశీలన తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ప్రముఖ మార్కెట్లైన ఆజాద్‌ పూర్‌ (న్యూఢిల్లీ), వాసి (ముంబై), రాజ్‌ కోట్, బరుదా (గుజరాత్‌) మార్కెట్లను సందర్శించి లేఔట్ల నమూనా తయారు చేశామన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ సమీపంలో ఉండటం, అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరగా ఉండడం, త్వరలో ఆర్‌ఆర్‌ఆర్‌ రానున్న నేపథ్యంలో కోహెడ మార్కెట్‌ అత్యంత ప్రాధాన్యం సంతరించుకోనుందని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు