కోవిడ్‌: ‘నేను చనిపోతే.. మీరంతా సంతోషంగా ఉంటారా’

3 Jun, 2021 12:33 IST|Sakshi

సాక్షి, సిరిసిల్ల: కోవిడ్‌ సోకిన వారు ఐసోలేషన్‌లో ఉండటం అందరికి తెలిసిన విషయమే.. ఇంట్లో  లేదా క్వారంటైన్‌ సెంటర్‌లో  జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే తమ నుంచి ఎవరికి సోకకుండా కుటుంబ సభ్యులకు సైతం దూరంగా ఉంటారు. అయితే సిరిసిల్ల జిల్లాలో కోవిడ్‌ సోకిన ఓ మహిళ వింతగా ప్రవర్తించింది. జిల్లాలోని సోమరిపేట గ్రామంలో ఓ మహిళకు ఇటీవల లక్షణాలు కనిపించడంతో కోవిడ్‌ టెస్ట్‌ చేసుకోవడంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇంట్లోనే ఓ గదిలో ఉంటూ మందులు వాడుతోంది.

ఆమె కొడుక్కి మూడేళ్ల క్రితం వివాహమవ్వగా.. అతను ఒడిశాలో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కోడలు, తన పిల్లలతో కలిసి ఉంటుంది. కరోనా సోకడంతో తనను దూరం పెట్టి కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటున్నారని భావించి, బలవంతంగా కోడలు వద్దకు వెళ్లి ఆమెను కౌగిలించుకుంది. అనంతరం కోడలు టెస్ట్‌ చేసుకోగా ఆమెకు సైతం కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. 

కోడలికి పాజిటివ్‌ రావడంతో అత్త ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించింది. దీంతో కోడలి సోదరి వచ్చి తిమ్మాపూర్‌లోని తమ పుట్టింటికి తీసుకెళ్లింది. అయితే ఈ విషయంపై కోడలు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. కరోనా వచ్చిన మా అత్తగారు ఒంటరిగా ఉండటంతో ఆమె మాపై కోపం పెంచుకున్నారు. దీంతో నేను కూడా కోవిడ్‌ బారిన పడాలని ఆమె అనుకుంది. నేను చనిపోతే మేమంతా సంతోషంగా జీవించాలనుకుంటున్నారా అని చెప్పి నన్ను హగ్‌ చేసుకుంది’. అని తెలిపారు. కాగా ప్రస్తుతం  అత్త కోలుకోగా.. కోడలు తన సోదరి ఇంట్లో  చికిత్స పొందుతోంది. 

చదవండి: అయ్యో పాపం; పచ్చని కుటుంబంలో ‘కరోనా’ కల్లోలం

మరిన్ని వార్తలు