స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌ అవార్డుల్లో సిరిసిల్ల టాప్‌

4 Dec, 2022 01:27 IST|Sakshi

ఫోర్‌ స్టార్‌ కేటగిరీలో దేశంలోనే మొదటి స్థానం 

అవార్డుపై మంత్రి కేటీఆర్‌ హర్షం 

జిల్లా ప్రజాప్రతినిధులు, ఉద్యోగులకు అభినందన 

సాక్షి, హైదరాబాద్‌/సిరిసిల్ల:  స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌–2023 అవార్డుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు దేశంలోనే ఫోర్‌ స్టార్‌ ర్యాంకింగ్‌ కేటగిరిలో మొదటి స్థానం దక్కింది. జిల్లాలోని అన్ని గ్రామాలను ఓడీఎఫ్‌ (బహిరంగ మలవిసర్జన రహితం) ప్లస్‌ కేటగిరిలో మోడల్‌ గ్రామాలుగా తీర్చిదిద్దినందుకుగాను ఈ అవార్డు లభించింది. కేంద్ర తాగునీరు–పారిశుధ్య మంత్రిత్వ శాఖ శనివారం ఈ విషయా­న్ని వెల్లడించింది.

ఓడీఎఫ్‌ ప్లస్‌ మోడల్‌ కింద అన్ని గ్రామాల్లోని ఇళ్లు, సంస్థలలో మరుగుదొడ్లు నిర్మించుకొని వినియోగించుకోవడం, గ్రామాలలో తడి, పొడి చెత్త సక్రమ నిర్వహణ, కంపోస్ట్‌ షెడ్ల వినియోగం, అన్ని గ్రామాలలో మురుగు నీటి నిర్వహణ, అన్నింటినీ పరిశుభ్ర గ్రామాలుగా తీర్చి దిద్దడంతో పా­టు ప్రతి గ్రామంలో పారిశుద్ధ్యానికి సంబంధించిన వా­ల్‌ పెయింటింగ్స్‌ ఏర్పాటు చేయడం అనే అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఈ అవార్డును ప్రకటించారు.  

అద్భుతాన్ని ఆవిష్కరించారు: మంత్రి కేటీఆర్‌ 
స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌ –2023 అవార్డుల్లో రాజన్నసిరిసిల్ల జిల్లాకు దేశంలోనే మొదటి స్థానం రావడంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజలు దృఢ సంకల్పంతో అద్భుతాన్ని ఆవిష్కరించారని అన్నారు. ఈ మేరకు సిరిసిల్ల జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులను అభినందించారు. ఈ విజయానికి కారణమైన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

ఇదే స్ఫూర్తితో రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు మరింత కృషి చేయాలని కోరారు. తాజా అవార్డుపై సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, సంబంధిత అధికారులను అభినందిస్తూ మంత్రి ట్వీట్‌ చేశారు. కాగా, ‘మీ నిరంతర మార్గదర్శనం, సహకారం కారణంగానే ఇది సాధ్యమైందంటూ’కలెక్టర్‌ కూడా ట్వీట్‌ చేశారు.  

మరిన్ని వార్తలు