సిరిసిల్ల జరీ.. అగ్గిపెట్టెలో చేరి

27 Dec, 2021 04:31 IST|Sakshi
అగ్గిపెట్టెలో ఇమిడే చీరను కట్టుకున్న యువతి

సిరిసిల్ల చేనేత కళాకారుడి సృష్టి 

వారం రోజులు శ్రమించి నేసిన కళాకారుడు 

బంగారు జరీపట్టు మరో విశేషం 

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్‌ అగ్గిపెట్టెలో ఇమిడేలా చీరను, దబ్బనంలో ఇమిడేలా మరో చీరను నేశాడు. కట్టుకునేందుకు వీలుగా ఉన్న ఈ రెండు చీరలను చేనేత మగ్గంపై బంగారం జరీ పోగులతో నేసి శభాష్‌ అనిపించుకున్నాడు. గతంలో చేనేత కళా వైభవాన్ని ప్రపంచానికి చాటిన పలువురు చేనేత కళాకారులు అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసినా.. అవి కట్టుకునేందుకు అనువుగా ఉండేవి కావు.


అగ్గిపెట్టెలో పట్టే చీరతో నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్‌

ఇప్పుడు హరిప్రసాద్‌ చేనేత మగ్గంపై గ్రాము బంగారం జరీతో నేసిన చీర కట్టుకునేందుకు అనువుగా ఉంది. మరోవైపు దబ్బనంలో దూరే చీరను సైతం హరిప్రసాద్‌ నేశాడు. ఈ విషయాన్ని ఆదివారం వెల్లడించాడు. న్యూజిలాండ్‌కు చెందిన సునీత–విజయభాస్కర్‌రెడ్డి దంపతుల కోరిక మేరకు రూ.10 వేల ఖర్చుతో అగ్గిపెట్టెలో ఇమిడే కట్టుకునే చీరను నేశాడు.


దబ్బనంలో ఇమిడే చీర 

ఈ చీర 5.5 మీటర్ల పొడవు, 160 గ్రాముల బరువుతో ఉంది. దబ్బనంలో దూరే చీరను సైతం కట్టుకునేందుకు వీలుగా నేశాడు. గ్రాము గోల్డ్‌ జరీ పట్టు దారాలతో ఈ చీరను నేశాడు. దీని బరువు 350 గ్రాములు ఉంటుంది. ఇప్పటికే సూక్ష్మ కళలో రాణిస్తున్న హరిప్రసాద్‌ అగ్గిపెట్టెలో ఇమిడే చీరను, దబ్బనంలో దూరే చీరను నేసి మరోసారి సిరిసిల్ల నేత కళను ప్రపంచానికి చాటి చెప్పాడు.

 

మరిన్ని వార్తలు