సిర్నాపల్లి కోవా తయారీదారుల కష్టాలు 

15 Feb, 2021 18:15 IST|Sakshi

రోజురోజుకూ వృత్తికి  దూరమవుతున్న వైనం 

కట్టెల సేకరణపై అటవీశాఖ ఆంక్షలు

పడిపోతున్న పాల ఉత్పత్తి..  మార్కెటింగ్‌ సదుపాయం కరువు

పాడిగేదెలు ఇప్పించాలని విజ్ఞప్తి

విద్యుత్‌ ఆధారిత పాలు కాచే యంత్రాలు, కోవ నిల్వచేసే యంత్రాల కోసం విన్నపం  

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ఆ ఊరి పేరు వింటే కోవా గుర్తుకు వస్తుంది.. కోవా అనగానే మన నోరూరుతుంది. నిజాంకాలం నుంచి ఆ ఊరే ఓ పాలకోవా... ఇంటింటా పాలవెల్లి.. ఏ ఇంటి ముందు చూసినా పాడిగేదెలే.. ఏ ఇంట చూసినా వంట చెరుకే.. పాలకోవా తయారీ ఆ గ్రామస్తుల వృత్తి. ఇది ఆ ఊరి ఒకప్పటి వైభవం.. ఆ ఊరి రైతు ప్రాభవం.. మరిప్పుడో! పాలవెల్లి పోయింది. కోవా.. వృత్తిని వదులు‘కోవా’అంటోంది. పాడి ఉత్పత్తి పడిపోయింది. వంట చెరుకు కోసం తంటాలు పడాల్సివస్తోంది. ఫలితంగా ఇప్పుడు పాలను మరిగించే రైతుల సంఖ్య కరిగిపోయింది. వారి సంఖ్య 200 నుంచి 20కి తగ్గింది. కోవా తయారీ మూడు క్వింటాళ్ల నుంచి అరక్వింటాకు పడిపోయింది. అంటే.. కోవా తయారీదారులు ఎలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారో అర్థమవుతుంది. ఇదీ నిజామాబాద్‌ జిల్లా సిర్నాపల్లి పాలకోవా కథ. తయారీదారుల వ్యథలు, కష్టాలపై ‘సాక్షి’అందిస్తున్న గ్రౌండ్‌ రిపోర్ట్‌..

సిర్నాపల్లి కోవా రుచే వేరు.. 
నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామం కోవా తయారీకి ప్రసిద్ధి. నిజాంకాలంలో ఈ ఊరు శీలం జానకీబాయి సంస్థానం. దీని చుట్టూ అటవీప్రాంతమే. పాడిగేదెల పెంపకం ఆ ఊరి రైతుల జీవనాధారం. ఒక్కో కుటుంబం కనీసం పది లీటర్ల నుంచి 50 లీటర్ల వరకు పాలు ఉత్పత్తి చేసేది. పాలను కేంద్రంలో విక్రయిస్తే నామమాత్రంగా డబ్బులు వస్తున్నాయని క్రమంగా పాల ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించారు. పాలను కాచి కోవా తయారు చేసి విక్రయిస్తున్నారు. కోవా చేసి అమ్మితే రెట్టింపు డబ్బులు గిట్టుబాటు కావడంతో రైతులు ఈ వృత్తిని ఎంచుకున్నారు.  

కట్టెల కొరత.. 
కోవా చేయాలంటే పాలను గంటల తరబడి మరిగించాల్సి ఉంటుంది. గతంలో సమీప అటవీ ప్రాంతం నుంచి కట్టెలు తెచ్చుకుని పాలను మరిగించేవారు. ఇప్పుడు కట్టెలు తెచ్చుకోవడంపై అటవీ అధికారులు ఆంక్షలు విధించారు. గ్యాస్‌ సిలిండర్‌పై పాలు కాద్దామంటే పెరిగిన గ్యాస్‌ ధరల దడదడ. ఇలా చేస్తే ఏమాత్రం గిట్టుబాటు కాదు. దీంతో కోవా తయారీపై రైతుల్లో ఆసక్తి తగ్గుతోంది. పాడి గేదెల గడ్డికి గడ్డు పరిస్థితి. గతంలో ఒక్కో రైతు కుటుంబంలో పది వరకు గేదెలుంటే ఇప్పుడు రెండు, మూడుకు మించి ఉండటంలేదు.  

3.5 లీటర్ల పాలకు కిలో కోవ.. 
కిలో కోవా తయారు చేయాలంటే కనీసం 3.5 లీటర్ల చిక్కటి పాలు అవసరం. నిత్యం పది లీటర్ల పాలు మరిగిస్తే 3.5 కిలోల వరకు కోవా ఉత్పత్తి అవుతుంది. కిలోకు రూ.300 చొప్పున ఊరిలోనే దళారులకు విక్రయిస్తున్నారు. కోవాను దళారులు నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్‌ వంటి నగరాలకు తరలించి కిలోకు రూ.500 నుంచి రూ.600 చొప్పున విక్రయిస్తున్నారు. పది లీటర్ల పాలను పాలకేంద్రంలో విక్రయిస్తే రోజుకు రూ.400 నుంచి రూ.500 వరకు మాత్రమే వస్తుంది. కానీ కోవా తయారు చేసి విక్రయిస్తే రోజుకు రూ.వెయ్యి వరకు గిట్టుబాటు అవుతుంది. గ్రామంలో గతంలో రోజుకు సుమారు మూడు క్వింటాళ్ల వరకు కోవా ఉత్పత్తయ్యేది. ప్రస్తుతం అర క్వింటాలుకు పడిపోయింది. కోవా తయారు చేసే కుటుంబాలు సిర్నాపల్లిలో ఒకప్పుడు సుమారు 200 వరకు ఉండేవి. ఇప్పుడా సంఖ్య 20కి పడిపోయింది.

పాలను కలుపుతూ కోవా తయారు చేస్తున్న ఈ రైతు పేరు శీలమంతుల నర్సయ్య. గతంలో రోజుకు కనీసం 40 లీటర్ల పాలతో 15 కిలోల కోవాను తయారు చేసి విక్రయించేవారు. దీంట్లో తన ఇద్దరు కుమారులు కూడా పాలుపంచుకునేవారు. ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో రోజుకు రెండు, మూడు కిలోలకు తగ్గించారు. ఇద్దరు కొడుకులు కోవా తయారీ పనిని వదిలేసి ట్రాక్టర్‌ మెకానిక్‌గా, ఇతర వృత్తుల్లో నిమగ్నమయ్యారు. 

విద్యుత్‌ ఆధారిత పాలు కాచే యంత్రాలు ఇవ్వాలి 
ఇరవై ఏళ్లుగా కోవా తయారీనే మా వృత్తి. మాకున్న రెండు గేదెలు ఎనిమిది లీటర్ల పాలు ఇస్తాయి. రోజుకు రెండు కిలోల వరకు కోవా తయారు చేస్తున్నాం. ఎండాకాలంలో గడ్డి దొరక్క పాలు ఉత్పత్తి తగ్గుతోంది. ప్రభుత్వం గేదెలతోపాటు విద్యుత్‌ ఆధారిత పాలు కాచే యంత్రాలు, కోవా నిల్వచేసే యంత్రాల కోసం రుణం ఇస్తే బాగుంటుంది. మార్కెటింగ్‌ సదుపాయం కూడా కల్పించాలి. 
– ఉప్పు వసంత, సిర్నాపల్లి 

పెళ్లిళ్ల సీజన్‌లో ఎక్కువ గిరాకీ
రైతుల వద్ద కొనుగోలు చేసిన కోవాను నిజామాబాద్, కామారెడ్డిలకు తీసుకెళ్లి అమ్ముతుంటా. ఒక్కో కిలోకు రూ.వంద నుంచి రూ.రెండు వందల వరకు గిట్టుబాటు అవుతుంది. ఒక్కోసారి ఎవరూ కొనుగోలు చేయకపోతే నష్టపోవాల్సి వస్తుంది. పెళ్లిళ్ల సీజన్‌లోనే గిరాకీ ఎక్కువ. కోవాను  నిల్వ చేస్తే రుచిపోతుంది. ఏ రోజుకు ఆ రోజు వినియోగిస్తేనే బాగుంటుంది.     
– ఎం.డి జావెద్, కోవా వ్యాపారి 

మరిన్ని వార్తలు