ఎస్సైల బదిలీలు చర్చనీయాంశం

16 Jan, 2021 20:59 IST|Sakshi

బదిలీలపై నెలరోజులుగా తర్జన భర్జన

సీపీ సెలవుల్లో ఉండగా ఉత్తర్వులు!

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: సబ్‌ ఇన్‌స్సెక్టర్ల బదిలీల అంశం పోలీసుశాఖలో చర్చనీయాంశమైంది. సీపీ కార్తికేయ సెలవుల్లో ఉన్న సమయంలో బదిలీ ఉత్తర్వులు వెలువడటం ఆసక్తికరంగా మారింది. జిల్లాలో 15 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయా స్థానాల్లోరెండేళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకున్న వారికి, రెండేళ్లకు దగ్గరలో ఉన్నవారికి స్థానచలనం కల్పిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. అయితే ఇందులో పనితీరుపై విమర్శలు ఎదుర్కొన్న ఒకరిద్దరు ఎస్సైలపై కూడా బదిలీ వేటుపడడం చర్చనీయాంశంగా మారింది. సీపీ మంగళవారం నుంచి వ్యక్తిగత సెలవులో వెళ్లారు. ఆయన సెలవుల్లో ఉండగా, ఉత్తర్వులు వెలువడడం ఆసక్తికరంగా మారింది.

సాధారణంగా ఎస్సైల బదిలీల విషయంలో సీపీ పంపే ప్రతిపాదిత జాబితాను పరిశీలించి డీఐజీ నిర్ణయం తీసుకుంటారు. బదిలీల ప్రక్రియకు సంబంధించి సీపీ నెలరోజులుగా కసరత్తు చేసినట్లు సమాచారం. మార్పులు, చేర్పులుచేశాక పంపిన ప్రతిపాదనల మేరకు ఉత్తర్వులు జారీఅయినట్లు తెలుస్తోంది. కాగా పోలీసుశాఖలో ఫిబ్రవరి,మార్చి మాసాల్లో పెద్దఎత్తున బదిలీలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. ఇంతలోపు ముందస్తుగా బదిలీలు జరగడం గమనార్హం. అయితే మూకుమ్మడిగా జరిగే బదిలీల్లో తమకు అనువైన స్థానం లభిస్తుందో లేదోననే ముందు జాగ్రత్తగా కొందరు తమకు అనుకూలమైన స్థానాలకు బదిలీ చేయించుకున్నారనే చర్చ కూడా జరుగుతోంది.(చదవండి: ఎంపీడీవో భారతి ఆత్మహత్యాయత్నం)

ప్రజాప్రతినిధులను సంప్రదించాకే..!
నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల కన్నుసన్నల్లోనే పోలీసు అధికారుల బదిలీలు జరగడం కొంతకాలంగా పరిపాటిగా మారింది. గతంలో జరిగిన బదిలీల్లో జిల్లాకు చెందిన ఒకరిద్దరు ఎస్సైలు రిలీవ్‌ కాలేదు. బదిలీ అయిన స్థానంలో జాయిన్‌ కాలేదు. ఈ వ్యవహారం అప్పట్లో పోలీసుశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో పాటు, విమర్శలకు దారి తీసింది. రాజకీయ పలుకుబడితో ఉన్నతాధికారుల ఆదేశాలను కూడా పాటించకపోవడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయి. దీంతో ఈసారి బదిలీల్లో పోలీసు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులను సంప్రదించాకే బదిలీపై నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. గతంలో మాదిరి ఘటనలు పునరావృతం కాకుండా ఈసారి జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు