ఎమ్మెల్యేలకు ‘ఎర’ కేసులో కొత్త ట్విస్ట్‌.. ఆ ముగ్గురికి లుకౌట్‌ నోటీసులు!

22 Nov, 2022 11:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొత్త ట్విస్ట్‌ నెలకొంది. నోటీసులు జారీ చేసిన ముగ్గురిపై లుకౌట్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, కేరళ బీడీజేఎస్‌ అ­ధినేత తుషార్‌, కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామిలపై లుకౌట్‌ నోటీసులు జారీ చేసింది. వీరంతా సోమవారం నాడు విచారణకు హాజరు కాకపోవడంతో లుకౌట్‌ నోటీసులు ఇచ్చింది. ఇక ఈ కేసులో బండి సంజయ్‌ అనుచరుడు, అడ్వకేట్‌ శ్రీనివాస్‌ను ఇప్పటికే ప్రశ్నించిన సిట్‌ మంగళవారం మరోసారి విచారణకు హాజరు కావాలని తెలిపింది.

కాగా సోమవారం ఉదయం బంజారాహిల్స్‌లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో విచారణకు హాజరు కావాల్సిందిగా బీఎల్‌ సంతోష్‌కు తొలిసారి జారీ చేసిన నోటీసులో సిట్‌ పేర్కొంది. కానీ సంతోష్‌ గైర్హాజరయ్యారు. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. సంతోష్‌తో పాటు కరీంనగర్‌కు చెంది­న న్యాయవాది శ్రీనివాస్, తుషార్‌ వెల్లాపల్లి,  కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామిలకూ సిట్‌ నోటీసులు జారీ చేసింది. అయితే శ్రీనివాస్‌ మినహా మి­గిలిన ముగ్గురూ విచారణకు హాజరుకాలే­దు. 

నోటీసులు అందిన తర్వాత విచారణకు హాజరుకాకపోతే 41–ఏ (3), (4) సీఆర్‌పీసీ కింద అరెస్టు చేస్తామని విచారణాధికారి, రాజేంద్రనగర్‌ ఏసీపీ బి.గంగాధర్‌ తొలి నోటీసులో పేర్కొన్నారు. అయితే ఆ నోటీసులపై బీజేపీ హైకోర్టును ఆశ్ర­యించింది. దీంతో తదు­పరి ఉత్తర్వులు వెలువడే వరకు సంతోష్‌ను అరెస్టు చేయవద్దని సిట్‌ను న్యాయస్థానం ఆదేశించింది.
చదవండి: కానిస్టేబుల్‌ ఈశ్వర్‌.. ఇతని రూటే సపరేటు.. దొంగలతో చేతులు కలిపి

మరిన్ని వార్తలు