TSPSC: పేపర్‌ లీక్‌ కేసులో కీలక ట్విస్ట్‌..

2 Apr, 2023 11:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ స్కాంపై దర్యాప్తు చేస్తున్న ‘సిట్‌’ శనివారం కమిషన్‌ కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డిలను ప్రశ్నించిన విషయం తెలిసిందే. తీగ లాగితే డొంక కదిలింది అన్న చందంగా ఈ కేసులో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. కమిషన్‌లో ఏం జరిగిందో ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. 

మరోవైపు.. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాలని సిట్‌ భావిస్తున్నట్టు సమాచారం. ఇక, పేపర్‌ లీక్‌ కేసులో టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌, సభ్యుడు లింగారెడ్డిని సిట్‌ శనివారం విచారించింది. వీరిద్దరినీ వేరువేరుగా 2 గంటలపాటు సిట్‌ విచారించింది. ఇక, విచారణ సందర్బంగా ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ కుమార్‌ గ్రూప్‌-1 పరీక్ష రాసినట్టు తనకు తెలుసని సిట్‌కు అనితా రామచంద్రన్‌ తెలిపారు. అయితే, పరీక్షల్లో ప్రవీణ్‌ అర్హత సాధించకపోవడంతో అతడిపై అనుమానం రాలేదని ఆమె చెప్పారు. మరోవైపు, లింగారెడ్డి మాత్రం తన పీఏ రమేష్‌ గ్రూప్‌-1 పరీక్ష రాసినట్లు తనకు తెలియదని అన్నారు. ఇక, మొత్తం పరీక్షల నిర్వహణను కాన్ఫిడెన్షియల్‌గా సిట్‌ సేకరించింది. 

సిట్‌ అదుపులో ఉన్న మాజీ ఉద్యోగులపై ఆగ్రహం..
అంతకు ముందు.. అనిత రామ్‌చంద్రన్, లింగారెడ్డి సిట్‌ కార్యాలయానికి వచ్చిన సమయంలో పోలీసు కస్టడీలో ఉన్న కమిషన్‌ మాజీ ఉద్యోగులు షమీమ్, రమేష్, సురేష్‌లు అక్కడే ఉన్నారు. వారిలో షమీమ్‌ అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌గా, రమేష్‌ సభ్యుడు లింగారెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా అరెస్టు అయ్యే వరకు పనిచేశారు. వారిని సిట్‌ కార్యాలయంలో చూసిన అనిత, లింగారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. మీ చర్యల వల్ల కమిషన్‌ పరువుపోవడంతోపాటు వేలాది మంది నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని మండిపడ్డట్లు తెలుస్తోంది. కమిషన్‌ ఉద్యోగులు, వివిధ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు అందించాలని సిట్‌ అనితను కోరింది.

మరిన్ని వార్తలు