యాదాద్రిలో స్వల్ప ఉద్రిక్తత

3 Apr, 2022 02:35 IST|Sakshi
క్యూకాంప్లెక్స్‌లో నిండిపోయిన భక్తులు 

అధికారులతో భక్తుల వాగ్వాదం

యాదగిరిగుట్ట: యాదాద్రీశుడి ఆలయంలో శనివారం భక్తులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఒకేసారి భక్తుల రద్దీ పెరిగిపోవడంతో ఆలయంలోని వివిధ విభాగాల్లో ఇబ్బందులు తలెత్తాయి. ప్రసాదం కౌంటర్ల వద్ద పురుషులకు, మహిళలకు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులకు, అధికారులకు మధ్య స్వల్ప గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన భక్తులు ప్రసాదం కౌంటర్ల అద్దాలను ధ్వంసం చేశారు. లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేయడానికి వెళ్తే అక్కడ దుస్తులు మార్చుకోవడానికి సరైన ఏర్పాట్లు లేవని భక్తులు ఆవేదన చెందారు. 

పనిచేయని కంప్యూటర్లు..
భక్తులు ఉచిత దర్శనం టికెట్‌ పొందేందుకు కొండ కింద కల్యాణ కట్ట వద్ద సీఆర్‌వో కార్యాలయం వద్దకు వెళ్లగా అక్కడ జియో ట్యాగింగ్‌ చేయడానికి కంప్యూటర్‌ మిషన్లు పనిచేయలేదు. భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు వచ్చి జియో ట్యాగింగ్, ఉచిత టికెట్లు లేకుండానే భక్తులను కొండపైకి తరలించారు. స్వామివారి ఆరగింపు సమయంలో, గవర్నర్‌ వచ్చిన సమయంలో సుమారు 2 గంటల పాటు సాధారణ భక్తుల దర్శనాలను నిలిపివేశారు. క్యూకాంప్లెక్స్‌లో ఏసీలు, ఫ్యాన్లు సరిగ్గా పని చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఉక్కపోతకు గురయ్యారు.

దర్శనానికి రెండు గంటల సమయం
దైవ దర్శనానికి 20 వేల మంది భక్తులు తరలిరాగా ప్రధానాలయంలో స్వయంభూల దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. శనివారం ఒక్కరోజే యాదాద్రీశుడిని 20వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. కాగా.. వివిధ పూజలతో శ్రీస్వామి వారి ఆలయానికి రూ.14,43,390 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఇక ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీస్వామి వారికి నిత్య పూజలు విశేషంగా కొనసాగాయి.

మరిన్ని వార్తలు