అరచేతిలో అశ్లీలం

9 Apr, 2022 03:18 IST|Sakshi

స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరగడంతో విచ్చలవిడిగా బూతు వీడియోల వీక్షణం

ప్రపంచవ్యాప్తంగా నిత్యం 25 కోట్ల మంది పోర్న్‌ చూస్తున్న వైనం

వారిలో 16 శాతం మంది భారతీయులేనని ఓ సంస్థ నివేదికలో వెల్లడి

సెల్‌ఫోన్‌ రిపేర్‌ షాపుల్లోనూ యథేచ్ఛగా గలీజు దందా

మెమొరీ కార్డులు, పెన్‌డ్రైవ్‌లలో వీడియోలు నింపి విక్రయాలు  

(కంచర్ల యాదగిరిరెడ్డి)
దేశంలో స్మార్ట్‌ఫోన్ల వాడకం భారీగా పెరగడంతో ‘అశ్లీలం’ఇప్పుడు సర్వాంతర్యామిగా మారింది. వాటికితోడు మెమొరీ కార్డులు, పెన్‌ డ్రైవ్‌లు లాంటి ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు సులభంగా అందుబాటులో ఉండటం వల్ల అశ్లీల సాహిత్యం విరివిగా వ్యాప్తి చెందుతోంది. టెలికామ్‌ పోర్టల్‌ ‘ది మొబైల్‌ ఇండియన్‌ డాట్‌ కామ్‌’ఇటీవల రూపొందించిన ఒక నివేదిక ప్రకారం 2021లో 4.5 కోట్ల మందికిపైగా భారతీయులు అశ్లీల వీడియోలు డౌన్‌లోడ్‌ చేసుకొని వీక్షించారు.

ప్రపంచవ్యాప్తంగా నిత్యం ఇలాంటి దృశ్యాలు చూస్తున్న (25 కోట్లు) వారిలో భారతీయుల వాటా 16 శాతం కావడం గమనార్హం. ఇక స్మార్ట్‌ఫోన్‌ వాడకం పెద్దగా తెలియని వారి కోసం మొబైల్‌ఫోన్‌ రిపేర్‌ షాపుల్లో, సైబర్‌ కేఫ్‌లలో మైక్రో మెమొరీ కార్డులు, పెన్‌ డ్రైవ్‌ల రూపంలో విరివిగా అశ్లీల వీడియోలు లభిస్తున్నాయని, ఈ తరహా వ్యాపారం భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ వంటి దేశాల్లో ఎక్కువని నివేదిక పేర్కొంది. 

రూ. వందకో అశ్లీల వీడియో... 
‘ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్‌ వెలుపల 4–5 దుకాణాలు రూ. కోట్లలో అశ్లీల వీడియోల వ్యాపారం చేస్తున్నాయి. ఈ దుకాణాల నుంచి అశ్లీల వీడియోలు కొనుగోలు చేస్తున్న వారిలో 90 శాతం మంది రోజువారీ కూలీలు, ఆఫీసు బాయ్‌లే. అక్కడి దుకాణదారులు రూ. 1,000 నుంచి రూ. 2,500 మధ్య లభించే ఫోన్లను పెద్దమొత్తంలో కొని వాటిలో అశ్లీల వీడియోలను నింపి ఒక్కో మొబైల్‌ను రూ. 3,500–4,000 వరకు విక్రయిస్తున్నారు.

వినియోగదారుల వద్ద స్మార్ట్‌ఫోన్‌ ఉంటే అశ్లీల సాహిత్యాన్ని వారు ఎంపిక చేసుకున్న భాషను బట్టి కనిష్టంగా రూ. 100, గరిష్టంగా రూ. 500కి ఒక వీడియో అప్‌లోడ్‌ చేస్తున్నారు’అని లీగల్‌ న్యూస్‌ అండ్‌ కామెంటరీ సర్వీస్‌ వెబ్‌సైట్‌ నిర్వాహకుల్లో ఒకరైన నిర్మలా గోవాల్కర్‌ వివరించారు. దేశంలో ప్రతి 40 సెకన్లకు ఒక అశ్లీల వీడియో రూపొందుతోందని, ఇందులో 38 శాతం పిల్లల లైంగిక వేధింపులతో ముడిపడి ఉన్నాయని వివరించారు.

ఈ ఏడాది గడిచిన 65 రోజుల్లో గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ ద్వారా వచ్చిన అంశాల్లో 25 శాతం మైనర్‌ బాలికల అశ్లీలతకు సంబంధించినవే ఉండటం బాధాకరమని ఆమె పేర్కొన్నారు. మైసూరుకు చెందిన రెస్క్యూ అనే గ్రూపు దక్షిణాదిలో 5,575 మంది కళాశాల విద్యార్థులపై చేపట్టిన సర్వే ప్రకారం 65 శాతం మంది క్రమం తప్పకుండా తమ ఫోన్లలో బూతు చిత్రాలు చూస్తున్నారు. ఈ విషయంలో బాలికల కంటే బాలురు 16 శాతం ఎక్కువ. 

హైదరాబాద్‌లోనూ అధికమే... 
హైదరాబాద్‌ అబిడ్స్‌లోని జగదీశ్‌ మార్కెట్‌లో మొబైల్‌ షాపు నిర్వహించే ఓ వ్యక్తి రోజుకు 250–300 నీలిచిత్రాలను అప్‌లోడ్‌ చేస్తున్నాడు. ఇంగ్లిష్‌ వీడియోలను కావాలంటే తక్కువ ధరకు, తెలుగు, హిందీ భాషల వీడియోలను ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. ఈ గలీజు దందాపై అతన్ని ప్రశ్నిస్తే తాను కేవలం పోర్న్‌ వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న వీడియోలనే విక్రయిస్తున్నానని చెప్పుకొచ్చాడు.

పైగా పోలీసులు గతంలో తనను నాలుగైదుసార్లు అనవసరంగా అరెస్టు చేశారని పేర్కొనడం గమనార్హం. అయితే గతంలో ఆ షాపు నిర్వాహకుడిని అరెస్టు చేసినప్పుడు అతని సెల్‌ఫోన్‌లో భారీగా అశ్లీల వీడియోలు కనిపించినట్లు ఓ పోలీసు అధికారి చెప్పారు. ఓ షోరూంలోని మహిళల ట్రయల్‌ రూంలో అమర్చిన కెమెరా ద్వారా రికార్డు చేసిన వీడియోలూ అతని వద్ద లభించాయన్నారు. 

 నిపుణుల సూచనలు... 
►మొబైల్‌ కంపెనీలు తమ ఫోన్ల ఉత్పత్తుల్లో నీలిచిత్రాలు డౌన్‌లోడ్‌ కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటే సమస్య చాలా వరకు తగ్గుతుంది. (యాపిల్‌ సంస్థ ఇప్పటికే నీలిచిత్రాల డౌన్‌లోడ్‌ను నిరోధించడానికి ఒక సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చింది. వాటిని డౌన్‌లోడ్‌ చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే వార్నింగ్‌ వచ్చేలా ఆ సంస్థ సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టింది.) 

►అశ్లీల చిత్రాలను చూడటాన్ని బెయిల్‌కు వీల్లేని నేరంగా పరిగణించే చట్టం తేవాలని కోరుతూ ఇండోర్‌కు చెందిన న్యాయవాది కమలేశ్‌ వాస్వాని సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. కర్ణాటక శాసనసభలో ఏకంగా ఒక మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు నీలిచిత్రాలు చూస్తూ దొరికిన ఘటనను సీరియస్‌గా తీసుకోవాలని కూడా ఆయన కోర్టును అభ్యర్థించారు.  

మరిన్ని వార్తలు