పరిస్థితి ఆందోళనకరం.. వారిలో 75 శాతం రక్తహీనత

4 Sep, 2021 12:46 IST|Sakshi

ఇలాంటి పరిస్థితి ఆందోళనకరమే

ఐటీడీఏ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి

మూడు నెలల్లో పరిస్థితిలో మార్పు రావాలి

సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్‌

నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏ అధికారులతో సమీక్ష 

ములుగు(వరంగల్‌): ఏజెన్సీ ప్రాంతాల్లోని గర్భిణుల్లో 75 శాతం మందికి రక్తహీనత (హిమోగ్లోబిన్‌ సమస్య) ఉండడం ఆందోళనకరమని సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ అన్నారు. శుక్రవారం ఏటూరునాగారం, భద్రాచలం, ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, కలెక్టర్లతో ములుగు జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సి పల్‌ సెక్రటరీ క్రిస్టియానా జñడ్‌ ఛోంగ్తూ, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్యదేవరాజన్, సీఎం ఓఎస్డీ (హరితహారం) ప్రియాంక వర్గీస్‌లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ముందుగా జిల్లాలోని మంగపేట మండలం బ్రాహ్మణపల్లి పీహెచ్‌సీ, ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి వెల్‌నెస్‌ సెంటర్, ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలంలోని అంగన్వాడీ కేంద్రాలకు తనిఖీ చేశారు. అనంతరం సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గర్భిణులకు 75శాతం హిమోగ్లోబిన్‌ సమస్య ఉండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలో 2,309, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6,348, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 1,897, ఖమ్మంలో 4,431 మంది తీవ్ర పోషణలోపానికి గురైన పిల్లలు ఉండడం బాధాకరమన్నారు.

ఆయా ఐటీడీఏల పరిధిలో మూడు లక్షల మంది చిన్నారులు వివిధ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. వచ్చే మూడు నెలల్లో పరిస్థితిలో మార్పు రావాలని, ఐసీడీఎస్, వైద్యశాఖ, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులు సమన్వయంగా ముందుకు సాగాలని సూచించారు. ఐటీడీఏ ప్రాంతాల్లో బాలామృతం, గుడ్లు, పాలు వంటి పోషకాహా రాలను అందిస్తున్నా.. ఎక్కడ లోపం ఏర్పడుతుందో అర్థం కావడం లేదన్నారు. లక్షమంది చిన్నారులకు 84 మంది మృత్యువాత పడుతున్నారని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వెల్‌నెస్‌ సెంటర్లలో పాముకాటు, కుక్కకాటు ఇంజక్షన్‌లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 

ఆరు నెలల్లో మిల్క్‌ బ్యాంకుల ఏర్పాటు..
వచ్చే ఆరు నెలల్లో మిల్క్‌ బ్యాంకులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతుందని సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ అన్నారు. కేరళ రాష్ట్రంలో పరిస్థితిని పరిశీలించిన తర్వాత రాష్ట్రంలో కేసీఆర్‌ కిట్, ఇమ్యూనైజేషన్‌ కార్యక్రమాలను బలోపేతం చేశారన్నారు. కేరళలో ప్రతి గ్రామపంచాయతీలు పోటీపడి పోషకాహారాన్ని అందించడాన్ని గమనించి సీఎం కేసీఆర్‌కు నివేదిక అందించామని తెలిపారు. ఐటీడీఏ పరిధిలోని ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, అసిఫాబాద్‌ జిల్లాలను పైలట్‌ ప్రాజెక్టులుగా తీసుకొని 8 నెలలపాటు రెండో వంతు పోషకాహారాన్ని అందిస్తామన్నారు. విజయవంతం అయితే అన్ని ప్రాంతాల్లో అమలు చేస్తామన్నారు.

37శాతమే ముర్రుపాలు తాగిస్తున్నారు...
రాష్ట్రంలో ప్రసవం అయ్యాక కేవలం 37శాతం మంది మాత్రమే పిల్లలకు ముర్రుపాలు తాగిస్తున్నారని, ఇది ఆందోళన కరమైన విషయమని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలు ఈ విషయంపై అవగాహన కల్పించాలని సూచించారు. గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టియానా మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో గిరి పోషణ పథకం ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అదనపు పౌష్టికాహారం అందిస్తామన్నారు.

మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్‌ మాట్లాడుతూ గ్రోత్‌మానిటరింగ్‌ డ్రైవ్‌ ద్వారా తక్కువ బరువుతో, పౌష్టికాహార లోపంతో గుర్తించిన పిల్లలు ములుగు జిల్లాలో 16శాతం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10.5శాతం, ఖమ్మం జిల్లాలో 6.2శాతం ఉన్నారని తెలిపారు. కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, ఐటీడీఏ ఏటూరునాగారం పరిధిలో చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. తాడ్వాయి అంగన్‌వాడీ కేంద్రంలో 100శాతం చిన్నారులు సరైన బరువుతో ఆరోగ్యవంతంగా పెరిగేలా పౌష్టికాహారం అందించిన అంగన్‌వాడీ టీచర్‌ భాగ్యలక్షి్మని అధికారులు అభినందించారు.

కార్యక్రమంలో  జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌పాటిల్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ అనిరుధ్, భద్రాచలం, ఉట్నూరు ఐటీడీఏ పీఓలు గౌతమ్‌ పోత్రు, బ్రవేష్‌ మిశ్రా, అదనపు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, భూపాలపల్లి అదనపు కలెక్టర్‌ టీఎస్‌.దివాకర్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి అల్లెం అప్పయ్య, పీహెచ్‌సీ వైద్యాధికారి నిఖిత, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత, భూపాలపల్లి సంక్షేమ అధికారి శామ్యూల్, డీఆర్‌డీఓ పురుషోత్తం, ఐసీడీఎస్‌ సీడీపీవోలు, సూపర్‌వైజర్‌లు, ఐటీడీఏ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.  

చదవండి: అదో వెరైటీ విలేజ్‌.. పురుషులకో భాష, మహిళలకు మరో భాష

మరిన్ని వార్తలు