రెండు పాములను పట్టుకొని షోచేశారు.. కాసేపటికి..

4 Aug, 2021 16:00 IST|Sakshi

కుమ్రంభీంజిల్లా(ఆదిలాబాద్‌): పాములను పట్టుకోవడంలో రాజులమని భావించారు. పట్టుకున్న పాములతో చాలాసేపు ఆడుకున్నారు.. ఈ క్రమంలో అదే పాముకాటు వేయటంతో ఒక యువకుడు చావుబతుకుల మధ్య ఆసుపత్రిపాలయ్యాడు. ఈ విషాద ఘటన కుమ్రంభీం జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జైనూర్‌ మండల కేంద్రంలోని హనుమాన్‌ దేవాలయం పక్కన రెండు పాములు కన్పించాయి.

ఈ క్రమంలో స్థానికులు, సోనుపటేల్‌ గూడకు చెందిన కనక రాంజీ, కనక రాందాస్‌లకు సమాచారం అందించారు. దీంతో, అన్నదమ్ములిద్దరు అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఆడుకుంటున్న జంట పాములను చేతితో ఓడిసి పట్టుకున్నారు. అంతటితో ఆగకుండా.. తాము పా​ములను పట్టుకున్నామని రోడ్డుపై వెళ్తున్న జనాలకు చూపెట్టారు. కాసేపు వాటితో ఆడుకున్నారు.

 ఒక పాము బుసలు కొడుతూ.. తీవ్రమైన కోపంతో కనక రాంజీ అనే యువకుడి ఏడమ చేయి బోటన వేలుపై కాటు వేసింది. దీంతో వారిద్దరు భయపడిపోయారు. అప్పటి వరకు ఉన్న వారి వినోదం కాస్త.. విషాదంగా మారిపోయింది. రాంజీని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. కాగా, పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్సకోసం ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు