Warangal: వ్యాక్సిన్‌ సెంటర్‌లోకి నాగుపాములు 

20 Sep, 2021 12:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, జనగామ(వరంగల్‌): జనగామ జిల్లా కేంద్రం లేబర్‌ అడ్డా ఏరియాలోని ఏబీవీ ఎయిడెడ్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్‌ సెంటర్‌లోకి రెండు నాగుపాములు వచ్చి హల్‌చల్‌చేసిన సంఘటన ఆదివారం జరిగింది. మెగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా ఏఎన్‌ఎం స్వర్ణ, మెప్మా ఆర్పీ షాహీన్, ఇతర వైద్య సిబ్బంది సెంటర్‌కు చేరుకున్నారు. టీకా కార్యక్రమం ప్రారంభించేందుకు తరగతి గదిలోకి వెళ్లిన సిబ్బందికి వేర్వేరు చోట్ల రెండు పాములు కనిపించడంతో... డోస్‌ల డబ్బాలు అక్కడే వదిలిపెట్టి భయంతో పరుగులు పెట్టారు.

పక్కనే శిథిలమైన గదిలోకి ఓ పాము వెళ్లగా, మరొకటి మాత్రం టీకా సెంటర్‌లోనే ఉండి పోయింది. విషయం తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయుడు నాగరాజు, కమిటీ సభ్యులు, స్థానికులు, మునిసిపల్‌ మేనేజర్‌రాములు అక్కడకు వచ్చి బయటకు పంపేందుకు గంట పాటు ప్రయత్నించి, విఫలమయ్యారు. దీంతో వ్యాక్సిన్‌ సెంటర్‌ను పాతగోదాంల వద్ద ఉన్న సబ్‌సెంటర్‌కు తరలించారు.

చిన్నారికి తప్పిన ముప్పు 
జనగామ రూరల్‌: పట్టణంలోని ఏసీరెడ్డి నగర్‌ డబుల్‌బెడ్‌ రూం కాలనీలో పాములు బుసకొడుతున్నాయి. కాలనీలో మౌలిక సదుపాయాలు అయిన వీధి దీపాలు, విద్యుత్, మంచి నీటి వసతి లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. వీటికి తోడుగా పాములు ఇళ్లలోకి వస్తున్నాయి. దీంతో చిన్నారులు పెద్దలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఆదివారం 8వ బ్లాక్‌లో గిద్దల ఎల్లయ్య ఇంట్లోకి పాము రాగా ఆ సమయంలో వారి కూతురు నైసి ఇంట్లోనే ఉంది. పక్కింటి వారు పామును గమనించి బిగ్గరగా అరవడంతో చాకచక్యంగా పామును బంధించారు.

చదవండి: తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్‌

మరిన్ని వార్తలు