మహిళల్లో పెరుగుతున్న స్థూలకాయం

11 Sep, 2022 10:58 IST|Sakshi

ప్రథమ స్థానంలో నిలిచిన హైదరాబాద్‌ 

జిల్లాలో బాధితులు 51 శాతం మంది 

దేశంలో 120, రాష్ట్రంలో 31 జిల్లాల్లో అధ్యయనం 

కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: అభివృద్ధితో పాటు అనారోగ్య కారక జీవనశైలికీ మన నగరం కేంద్రంగా మారుతోంది. ఇక్కడి మహిళల్లో ఒబెసిటీకి కూడా చిరునామాగా నిలుస్తోంది. ఈ విషయాన్ని ఓ అధ్యయనం వెల్లడించింది. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మహిళల్లో ఒబెసిటీకి నగరం రాజధానిగా నిలిచింది. దేశంలో 15 నుంచి 49 సంవత్సరాల వయసు పురుషుల కంటే స్త్రీలలో అధిక బరువు/ఊబకాయం ఎక్కువగా ఉంది. ఈ విషయంలో పురుషుల (22.9%) కంటే మహిళలు (24%) ముందున్నారు. జాతీయ ఆరోగ్య సర్వే ఆధారంగా నగరం కేంద్రంగా పనిచేస్తున్న కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ నిర్వహించిన అధ్యయనం ఈ అంశాలను తేటతెల్లం చేసింది.  

పెరుగుదలలో మనం తక్కువే.. 
కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ అధ్యయనం ప్రకారం మహిళల్లో అధిక బరువు/ఊబకాయం డేటాను పోల్చినప్పుడు అన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఒబెసిటీ సంఖ్యలు జాతీయ సగటు కంటే  ఎక్కువగా ఉన్నాయి. మహిళలు, పురుషులిరువురి విషయంలోనూ ఉత్తర భారతం కంటే దక్షిణ భారతమే ముందంజలో ఉంది. పెరుగుదల ప్రకారం చూస్తే.. జాతీయ స్థాయిలో, ఊబకాయం 3.3% పెరగగా, దక్షిణాది రాష్ట్రాల్లో అంతకు మించి వేగంగా పెరుగుతోంది. ఈ విషయంలో 9.5%తో తమిళనాడు అగ్రస్థానంలో ఉండగా, వరుసగా 6.9%, 5.7%లతో కర్ణాటక, కేరళ దానిని అనుసరిస్తున్నాయి.  తెలంగాణలో మాత్రం 2%తో అత్యల్పంగా ఉండడం ఊరటనిచ్చే అంశం.  
రాష్ట్రంలో సిటీ టాప్‌... 
దేశవ్యాప్తంగా 120 జిల్లాలు, మన రాష్ట్రంలో 31 జిల్లాల్లో నిర్వహించిన అధ్యయనంలో.. మహిళల్లో ఊబకాయం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ జిల్లా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. మన జిల్లాలో 51% మంది ఊబకాయంతో బాధపడుతున్నారని తేలింది. అదే సమయంలో 14%తో అతి తక్కువ ఊబకాయులున్న  కుమరంభీం ఆసిఫాబాద్‌ ఈ జాబితాలో అట్టడుగున ఉంది. అదే విధంగా గ్రామీణ ప్రాంత మహిళల కంటే పట్టణ మహిళలే ఎక్కువ ఊబకాయంతో బాధపడుతున్నారని, సంపన్న, నిరుపేద వర్గాలతో పోలిస్తే మధ్యతరగతి వర్గాలలో ఈ సమస్య ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం వెల్లడించింది. ఇందులోంచి గర్భిణులు, 
బాలింతలను మినహాయించారు.

అందుబాటులోకి కొత్త పరిష్కారాలు 
ఓ వైపు ఒబెసిటీ బాధితులు పెరుగుతున్న కొద్దీ మరోవైపు కొత్త పరిష్కార మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. డైట్, వర్కవుట్స్‌ వంటి సహజమైన పద్ధతులను అనుసరించి బరువు తగ్గే విధానాలతో పాటు సర్జరీలు, మందులు, ఇంజెక్షన్లు వగైరా రోజుకోటి నగరంలో వెల్లువెత్తుతున్నాయి. ‘ఒబెసిటీ సమస్య తీవ్రంగా ఉంది. దీనికి పరిష్కారాలు వీలైనంత సులువుగా ఇతరత్రా ఇబ్బందులు కలగించనివిగా ఉండాలని ఆధునిక మహిళలు కోరుకుంటున్నారు’ అని చెప్పారు వెయిట్‌లాస్‌కి ఉపకరించే క్యాప్సూల్‌ తరహా గ్యా్రస్టిక్‌ బెలూన్‌ని తాజాగా నగరంలో విడుదల చేసిన అల్యూరిన్‌ సంస్థ వ్యవస్థాపకులు డా.శంతను గౌర్‌.   

మరిన్ని వార్తలు