దివ్యాంగులకు కావాల్సింది మద్దతు

4 Dec, 2020 05:51 IST|Sakshi
అసిస్టివ్‌ టెక్నాలజీ ఎగ్జిబిషన్‌లో ఆవిష్కరణలను పరిశీలిస్తున్న మంత్రి కేటీఆర్‌

పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: దివ్యాంగులు సమాజం నుంచి సానుభూతిని కాకుండా మద్దతును కోరుకుంటారని, వారికి సమాజం అండగా నిలవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన అసిస్టివ్‌ టెక్నాలజీ ఎగ్జిబిషన్‌ను కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం జరిగిన ‘అసిస్టివ్‌ టెక్నాలజీ సదస్సు 2020’లో ఆయన మాట్లాడుతూ ఈ రంగంలో పనిచేస్తున్న స్టార్టప్‌లు సాంకేతికతను ఉపయోగించుకుని దివ్యాంగులకు అవసరమైన పరికరాలను తయారు చేయాలని సూచించారు. స్టార్టప్‌లు తయారు చేసే పరికరాలకు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని, వారి ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా తోడ్పాటును అందిస్తుందని పేర్కొన్నారు. దివ్యాంగుల ఆత్మగౌరవం నిలబెట్టే దిశగా అడుగు పడాలని, బధిరులు, అంధులతో పాటు అంగవైకల్యం కలిగిన వారికి అవసరమైన పరికరాలు తయారు కావాలని కేటీఆర్‌ అన్నారు. వ్యవసాయం, మహిళల రక్షణతో పాటు సమాజంలో అవసరమైన రంగాలన్నింటిలో శాస్త్రీయ ఆవిష్కరణలు పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 

ఎగ్జిబిషన్‌ పరిశీలన 
దివ్యాంగులు నిత్యం ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం స్టార్టప్‌లు రూపొందించిన ఆవిష్కరణలతో ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొటోటైప్‌ ఇంక్యుబేటర్‌ టీ వర్క్స్‌లో తమ ఆలోచనలకు రూపం ఇవ్వాలని స్టార్టప్‌లకు సూచించారు. ఆవిష్కర్తలు, విద్యార్థులు, స్టార్టప్‌లు రూపొం దించిన 30కి పైగా ఆవిష్కరణలను కేటీఆర్‌ పరిశీలించారు. ఐఐటీ హైదరాబాద్, టీ వర్క్స్, సోషల్‌ ఆల్ఫా, ఆర్ట్‌లాబ్‌ ఫౌండేషన్, అసిస్టెక్‌ ఫౌండేషన్, ఎల్వీ ప్రసాద్‌ నేత్రవిజ్ఞాన సంస్థలు ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నాయి. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్, దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ డా.వాసుదేవరెడ్డి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, దివ్యాంగుల సం క్షేమశాఖ కార్యదర్శి దివ్య, కమిషనర్‌ శైలజ, టీఎస్‌ఐసీ సీఈఓ రవి నారాయణ్‌ పాల్గొన్నారు.

అన్ని రంగాల్లో రాణిస్తున్న దివ్యాంగులు: ఎంపీ సంతోష్‌కుమార్‌
సాక్షి, హైదరాబాద్‌: సమాజంలో ఎంతోకాలం అవమానాలు, అసమానతలకు గురైన దివ్యాంగులు ఇటీవల అవకాశాలను అందిపుచ్చుకుని అనేక రం గాల్లో ప్రతిభ చూపుతున్నారని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ కార్పొరేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె.వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ భవన్‌లో జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో సంతోష్‌కుమార్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివ్యాం గుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని, వారు ఆత్మగౌరవంతో బతికేలా ఆసరా పథకం ద్వారా ఆదుకుంటోందని పేర్కొన్నారు. దివ్యాంగులతో ముచ్చటించిన ఎంపీ సంతోష్‌ వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. త్వరలో దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు, అంధులకు లాప్‌టాప్స్, బధిరులకు 4జి స్మార్ట్‌ఫోన్లు, బ్యాటరీ వీల్‌చైర్లు తదితర ఉపకరణాలు ఇస్తామని వాసుదేవరెడ్డి వెల్లడించారు.

దివ్యాంగులకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా ఉంటోందని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ప్రతి నెలా రూ.3,016 పెన్షన్‌ అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వివిధ జిల్లాలకు చెందిన దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు గురువారం కవితను ఆమె నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు రూ.500 పెన్షన్‌ ఇవ్వగా, టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పెన్షన్‌ మొత్తాన్ని రూ.3,016కు పెంచిందన్నారు.

గత ఆరేళ్లుగా వికలాంగుల కార్పొరేషన్‌ ద్వారా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. దివ్యాంగులకు ఉపయోగపడే వాహనాలు, అనేక ఇతర పరికరాలను తమ ప్రభుత్వం అందిస్తోందన్నారు. సీఎం కేసీఆర్‌ దివ్యాంగుల సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వ కృషికి గత ఏడాది డిసెంబర్‌ 3న రాష్ట్రపతి అవార్డు దక్కిందని కవిత గుర్తు చేశారు. కవితను కలసిన వారిలో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్, 21 దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు