విడతలుగా వర్క్‌ ఫ్రం హోం తొలగింపు

25 Jan, 2021 08:07 IST|Sakshi

ఈ ఏడాదీ ఐటీ ఉద్యోగులకు తప్పని వర్క్‌ ఫ్రం హోం 

వంద శాతం ఆఫీసు నుంచి పని కష్టమే. 

సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగులకు మరికొంత కాలం ‘వర్క్‌ ఫ్రం హోం’ కొనసాగే సూచనలు కన్పిస్తున్నాయి. కరోనా సంక్షోభం ఇంకా వీడనందున...ఇప్పటికిప్పుడే వంద శాతం మంది ఆఫీసులకు హాజరై విధులు నిర్వర్తించే సూచనలు లేవు. కొన్ని కంపెనీలు విడతల వారీగా వర్క్‌ఫ్రం హోంను తొలగిస్తున్నందున మార్చి చివరికి 40 శాతం మంది, డిసెంబర్‌ నాటికి 70 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఆఫీసులకు హాజరయ్యే అవకాశం ఉందని హైసియా తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇంటి నుంచి పనిచేసినా ఐటీ రంగంలో ఉత్పాదక తగ్గలేదని, ఇక ఈ ఏడాది ఐటీ వృద్ధి రేటు గతేడాదితో పోలిస్తే 5 శాతమే పెరుగుదల నమోదయ్యే అవకాశాలున్నట్లు అధ్యయనంలో తేలింది. మరోవైపు దాదాపు పది కంపెనీలు ఇక్కడ ఆఫీసుల ఏర్పాటుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయని తెలిసింది. తద్వారా 25 నుంచి 30 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.   

సాక్షి, హైదరాబాద్‌: ఐటీ ఉద్యోగులు మార్చి చివరినాటికి 40 శాతం..డిసెంబరు చివరికి 70 శాతం మంది ఆయా కంపెనీల్లో  ప్రత్యక్ష విధులకు హాజరవుతారని హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) తాజా అధ్యయనంలో వెల్లడైంది. కోవిడ్‌ కలకలం నుంచి క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో ఇప్పుడిప్పుడే పలు కంపెనీలు కొద్ది శాతం మంది ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోంను తొలగిస్తున్నాయని హైసియా వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. మొత్తంగా ఈ ఏడాది ఐటీ వృద్ధి గతేడాదితో పోలిస్తే 5 శాతం వృద్ధిరేటు సాధించే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నామన్నాయి. కాగా నూతన ఐటీ కంపెనీల ఏర్పాటుకు పదికిపైగా బహుళజాతి కంపెనీలు ఆసక్తి చూపుతుండడం విశేషం. ఈమేరకు పలు ఎంఎన్‌సీ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నప్పటికీ వారి ఉత్పాదకత ఏమాత్రం తగ్గలేదని..అయితే పలు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఉద్యోగులకు ఇంటర్నెట్‌ సమస్యలు, ఇంట్లో వాతావరణం ఇబ్బందులు కలిగిస్తుండడం గమనార్హం. 

ప్రభుత్వానికి పలు సంస్థల దరఖాస్తు.. 
గ్రేటర్‌ పరిధిలోని హైటెక్‌సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి(ఐటీ కారిడార్‌) పరిధిలో నూతన ఐటీ కంపెనీల ఏర్పాటుకు పదికి పైగా బహుళజాతి సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. వీటిలో అమెరికాకు చెందిన ప్రముఖ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ ‘మాస్‌ మ్యూచువల్‌’ సంస్థతోపాటు ‘ఫియట్‌ క్రిస్లర్‌’ సంస్థ సైతం పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నగరంలో నెలకొల్పనున్నట్లు సమాచారం. ఇక చైనాకు చెందిన ఒప్పో సంస్థ 5జి పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నగరంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. మిగతా కంపెనీల వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఐటీ శాఖ స్పష్టం చేసింది. ఆయా కంపెనీల ప్రతినిధులతో చర్చలు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. 

ఐటీలో కొలువుల భూమ్‌? 
ప్రస్తుతం గ్రేటర్‌ పరిధిలో కార్యకలాపాలు సాగిస్తున్న చిన్న, పెద్ద, బహుళజాతి కంపెనీలు 1500 వరకు ఉన్నాయి. వీటిల్లో 6.5 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. నూతన కంపెనీల ఏర్పాటుతో ఈ ఏడాది ఐటీ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 25–30 వేల ఉద్యోగాల కల్పన సాధ్యపడుతుందని హైసియా వర్గాలు అంచనా వేస్తున్నాయి.  ప్రస్తుతం వర్క్‌ఫ్రం హోం విధానం కొనసాగిస్తున్న పలు కంపెనీలు క్రమంగా తమ ఉద్యోగులను విధులకు రప్పిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు జూమ్‌ విధానంలో సమావేశాలు కొనసాగిస్తున్నాయి. 

ఐటీ రంగానికి ఢోకాలేదు 
గ్రేటర్‌ పరిధిలో ఐటీ రంగానికి ఎలాంటి ఢోకాలేదు. కరోనా కారణంగా స్వల్ప ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఈ రంగం తిరిగి పురోగమిస్తోంది. వర్క్‌ ఫ్రం హోం కారణంగా ఉద్యోగులు ఇళ్లలో ఇంటర్నెట్, కరెంట్‌ సమస్యలు, ఇతరత్రా ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో ఒత్తిడికి గురవుతున్నారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటుండడంతో క్రమంగా ఉద్యోగులు విధులకు హాజరవుతున్నారు. – భరణి, హైసియా అధ్యక్షులు 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు