ఇక్కడ ఉంటే జాబ్‌ చేస్తున్నట్లే లేదు..!

21 Feb, 2021 02:05 IST|Sakshi

పల్లెల నుంచే పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు

ఇంటి నుంచి పని సంతోషంగా ఉందంటున్న టెకీలు

తల్లిదండ్రుల బాగోగులు, పనులు చూసుకునే అవకాశం

ప్రయాణాలు, అద్దె భారం, ఇతర ఖర్చులు తగ్గాయి..

నెట్‌వర్క్‌ సమస్యలు తప్ప అంతా బాగుందని ఆనందం

పల్లె అందాలు వీక్షిస్తూ.. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం

సాక్షి నెట్‌వర్క్‌: ఆరు నెలలు, సంవత్సరానికి తల్లిదండ్రులను చూసేందుకు పల్లెలకు వచ్చే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కరోనా పుణ్యమా అని ఇప్పుడు ఇంటిపట్టునే ఉండి పనిచేసుకుంటున్నారు. కరోనా కారణంగా దాదాపు అన్ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు వర్క్‌ఫ్రం హోం ఇవ్వడంతో ఉద్యోగులు పట్టణం వీడి పల్లెబాట పట్టారు. మార్చి 2020 నుంచి సుమారు 10 నెలలుగా గ్రామీణ ప్రాంతాల నుంచే వందలాది మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటు వ్యవసాయ పనులు చూసుకుంటూ, తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూ అటు పిల్లలతో కలసిమెలసి పని చేసుకుంటున్నారు.

పట్టణాల్లో ప్రయాణానికే గంటల తరబడి సమయం పట్టేదని, ఇప్పుడు ప్రయాణం అవసరం లేకపోవడంతో ఒత్తిడి లేకుండా ప్రశంతంగా ఉందని పలువురు ఐటీ ఉద్యోగులు అంటున్నారు. ఆఫీసులో కంటే ఎక్కువ ఉత్సాహంతో ఇంటి వద్ద విధులు నిర్వర్తిస్తున్నామని చెబుతున్నారు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, మంచిర్యాల, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వర్క్‌ఫ్రం హోం చేస్తున్న పలువురు ఐటీ ఉద్యోగులను ‘సాక్షి’పలకరించింది.

జాబ్‌ చేస్తున్నట్లే లేదు.. 
నేను టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తున్నాను. గతంలో కేరళ, కర్ణాటకలో పనిచేశాను. ప్రస్తుతం వర్క్‌ఫ్రం హోం చేస్తున్నాను. ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య ఉంటూ జాబ్‌ చేయటం చాలా ఆనందంగా ఉంది. దూర ప్రాంతాల్లో పని చేస్తూ కుటుంబసభ్యులతో ఫోన్లలో మాత్రమే మాట్లాడుకునేవారం. వర్క్‌ ఫ్రంహోం చేయడంతో అసలు జాబ్‌ చేస్తున్నట్లే లేదు. 
–అఖిల, నవాబ్‌పేట, మహబూబ్‌నగర్‌ జిల్లా 

పల్లె అందాలను ఆస్వాదిస్తూ..
నేను హైదరాబాద్‌లోని విప్రోలో  టెక్నాలజీ లీడ్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నా. నగరంలో పని ఒత్తిడితో ఉద్యోగం బిజీబిజీగా ఉండేది. ఇప్పుడు సొంతూరిలో ప్రశాంతంగా పనిచేస్తూ కుటుంబ సభ్యుల మధ్య పండుగలను జరుపుకుంటూ పల్లె అందాలను ఆస్వాదిస్తున్నాను.
– నూతి సందీప్, నెన్నెల, మంచిర్యాల  

మరిన్ని వార్తలు