Hyderabad: మాజీ ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడ్డ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ 

14 Nov, 2022 14:27 IST|Sakshi
మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన

సాక్షి, హైదరాబాద్‌: అర్ధరాత్రి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలి ఇంట్లోకి చొరబడ్డాడు. తమను హత్య చేసేందుకు వచ్చాడని ఆరోపిస్తూ ఆమె కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బల్కంపేట రోడ్డులో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి ఓ వ్యక్తి ప్రహరీ దూకి మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ఉంటున్న పై పోర్షన్‌ గది తలుపులు తెరిచేందుకు యత్నించాడు. కింది ఫ్లోర్‌లో డ్రైవర్‌ అప్రమత్తమై ప్రసూనకు ఫోన్‌ చేసి ఎవరో తన గదికి బయటి నుండి గడియ వేశారని తెలిపాడు.

దీంతో అప్రమత్తమైన ఆమె కుటుంబ సభ్యులు లైట్లు వేయడంతో సదరు వ్యక్తి తిరిగి గోడ దూకి పారిపోయాడు. సీసీ కెమెరాల ఫుటేజీలను ఆధారంగా ప్రసూన, ఆమె కుమార్తె కరణం అంభిక కృష్ణ చౌదరి తమ అనుచరులతో కలిసి అతడి కోసం గాలించారు. సమీపంలోని బార్‌లో కూర్చుని ఉన్న నిందితుడిని పట్టుకున్నారు. అతడిని ప్రశ్నించగా ప్రకాశం జిల్లా, కనిగిరికి చెందిన చంద్రశేఖర్‌ అని చెప్పినట్లు కరణం అంభిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కరణం వెంకటేష్‌ అనే వ్యక్తితో తనకు విభేదాలున్నాయని, తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆమె ఆరోపించింది.

వెంకటేష్‌ అనుచరుడు త్రివేది అనే వ్యక్తిపై ఇదివరకే చీరాల డీఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపింది. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని చంద్రశేఖర్‌రెడ్డిగా గుర్తించినట్లు ఇన్స్‌పెక్టర్‌ సైదులు తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్న అతను బల్కంపేటలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నట్లు తెలిపారు. మద్యం మత్తులో ఇంట్లోకి ప్రవేశించానని చెబుతున్నాడని, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.  
చదవండి: కాలేజ్‌ బిల్డింగ్‌ పైనుంచి దూకి బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

మరిన్ని వార్తలు