నాలా విషాదం: మణికొండ డీఈ సస్పెన్షన్‌! 

1 Oct, 2021 07:45 IST|Sakshi

సాక్షి, మణికొండ: వరదలో ఓ వ్యక్తి కొట్టుకు పోయి మృతిచెందిన సంఘటనలో మరో అధికారిపై వేటు పడింది. సెప్టెంబర్‌ 25న మణికొండ మునిసిపాలిటీ గోల్డెన్‌ టెంపుల్‌ ఎదుట నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ కాలువలో కొట్టుకుపోయిన రజినీకాంత్‌(42) రెండు రోజుల తరువాత నెక్నంపూర్‌ చెరువులో తేలిన విషయం తెలిసిందే. ఆ సంఘటనకు నిర్లక్ష్యంగా పనులు చేపట్టడమే కారణంగా చూపుతూ ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఏఈ విటోభను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం మణికొండ, షాద్‌నగర్, పరిగి మునిసిపాలిటీలతో పాటు మిషన్‌భగీరథకు ఇంచార్జిగా పనిచేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ సాజిద్‌ను సస్పెండ్‌ చేసినట్టు సమాచారం.

ఇంజినీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ శాఖ రాష్ట్ర అధికారులు తమ కార్యాలయానికి పిలిచి సస్పెన్షన్‌ ఉత్తర్వులను అందించినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని మణికొండ మునిసిపల్‌ కమిషనర్‌ జయంత్‌ వివరణ కోరగా సస్పెన్షన్‌ ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలిసిందని నిర్ధారించారు. కాగా, మునిసిపల్‌ కమిషనర్‌ జయంత్‌పై కూడా ఆ శాఖ దృష్టి సారించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇతనిపై వేటు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. 
చదవండి: మణికొండలో గల్లంతైన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ మృతదేహం లభ్యం
  
కాంట్రాక్టర్‌తో పాటు సబ్‌కాంట్రాక్టర్‌పైనా విచారణ :  
ఈ సంఘటనపై ఇప్పటికే మునిసిపాలిటి కమిషనర్‌ కాంట్రాక్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారికంగా టెండర్‌ తీసుకున్నది రాజ్‌కుమార్‌ కాగా పనులను మాత్రం కుమార్‌ అనే మరో సబ్‌ కాంట్రాక్టర్‌ చేపడుతున్నాడు. దీంతో పూర్తి వివరాలను అందించాలని నార్సింగి పోలీసులు మునిసిపల్‌ కమిషనర్‌కు లేఖ రాశారు. వివరాలు అందగానే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులందరిపై చర్యలు తీసుకుంటామని నార్సింగి సీఐ గంగాధర్‌ పేర్కొన్నారు.  
చదవండి: ఇంటి ఆవరణలో నాలుగు లారీల చెత్త జమ చేసి.. ఓ మహిళ వింత ప్రవర్తన

మరిన్ని వార్తలు