ఈ చలాన్‌తో దొరికిన ఆచూకీ

17 Dec, 2020 02:59 IST|Sakshi
సతీశ్‌ను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న డీఎస్పీ శంకర్‌రాజు

నాలుగేళ్ల క్రితం తప్పిపోయిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ 

కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు  

జహీరాబాద్‌ టౌన్‌: ఈ చలాన్‌ ద్వారా తప్పిపోయిన ఓ వ్యక్తి ఆచూకీ లభించింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో చోటు చేసుకుంది. డీఎస్పీ శంకర్‌రాజు కథనం ప్రకారం.. హైదరాబాద్‌ మదీనాగూడకు చెందిన ముల్లపూడి సతీశ్‌ (35) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. అతని తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీసులు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేశారు. కాగా, లాక్‌డౌన్‌ సమయంలో మాస్కు లేకుండా ఏపీ10ఏయూ 9252 నంబర్‌  బైక్‌పై తిరుగుతున్న ఓ వ్యక్తిని జహీరాబాద్‌ పోలీసులు ఆపి తనిఖీ చేశారు.

అతని వద్ద బైక్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్‌ లేకపోవడంతో జరిమానా విధించి ఈ చలాన్‌లో పొందుపరిచారు. ఈ వివరాలు రిజిస్టర్‌ ఫోన్‌ నంబర్‌కు మెసేజ్‌ ద్వారా వచ్చింది. ఇది చూసిన కుటుంబ సభ్యులు తప్పిపోయిన సతీశ్‌.. జహీరాబాద్‌లో ఉన్నట్లు తెలుసున్నారు. వెంటనే డీఎస్పీ శంకర్‌రాజును కలిశారు. పట్టణంలో అమర్చిన కెమెరాల ఆధారంగా జహీరాబాద్‌ టౌన్‌ ఎస్సై వెంకటేశ్, కానిస్టేబుల్‌ హనీఫ్‌లు సతీశ్‌ ఆచూకీ కనుగొని బుధవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు.  

మరిన్ని వార్తలు