చితి మంటలకు చెల్లు! విదేశాల్లో ఉన్నవారు సైతం చూసేలా...

25 Jun, 2022 07:14 IST|Sakshi

ఎల్‌బీనగర్‌(హైదరాబాద్‌): ఆ శ్మశాన వాటికలో చితిమంటలు ఉండవు. కట్టెలతో కాల్చే పద్ధతి కానరాదు. ఎల్‌బీనగర్‌లో ఆధునిక విధానంలో సోలార్‌ శ్మశాన వాటిక త్వరలోనే అందుబాటులోకి రానుంది. నాగోలు వద్ద ఫతుల్లాగూడలో నిర్మించే శ్మశాన వాటిక ఇందుకు వేదిక కానుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఇక్కడి శ్మశాన వాటిక పనులు తుది దశకు చేరుకున్నాయి.  

సోలార్‌ బర్నింగ్‌ శ్మశాన వాటిక నిర్మాణ పనులు హెచ్‌ఎండీఏ పైలట్‌ ప్రాజెక్టు కింద చేపట్టింది. సుమారు రూ.25 కోట్లతో దీని పనులు పూర్తి కావస్తున్నాయి. మరో వారం రోజుల్లో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే విదేశాల్లో ఉన్నవారు సైతం తమ బంధువుల అంత్యక్రియలను ఇంటర్నెట్‌ ద్వారా చూసే అవకాశముంది. ఇందుకోసం తెర ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 25 సీసీ కెమెరాలతో పాటు ఒక తెర ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధానం నగరంలోనే మొదటిది.    

ఫతుల్లాగూడలోని మహాప్రస్థానాన్ని సుమారు 6 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఇక్కడ మూడు మతాలకు చెందిన శ్మశాన వాటికలను రూపుదిద్దుకుంటున్నాయి. హిందు, క్రిస్టియన్, ముస్లింలకు వేర్వేరుగా అత్యున్నత ప్రమాణాలతో అన్ని హుంగులతో నిర్మాణం సాగుతోంది. సుందరమైన లాన్లు, పచ్చిక బయళ్లు, కూర్చునేందుకు విశాలమైన హాల్‌ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. 

దేశంలో ఎక్కడా లేని విధంగా..  
ఫతుల్లాగూడలోని మహాప్రస్థానాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేశాం. ఇదొక అద్భుతమైన ప్రాజెక్టు. ఇక్కడికి వచ్చేవారికి అన్ని సదుపాయాలు కల్పించనున్నాం. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.  
–  దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే  

(చదవండి: ఇదేమి ‘పని’ష్‌మెంట్‌!)

మరిన్ని వార్తలు