Solar Power: హైదరాబాద్ నగరంలో పవర్‌ హౌస్

16 Apr, 2021 08:50 IST|Sakshi

సౌరవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలుగా గేటెడ్‌ కమ్యూనిటీలు, టౌన్‌షిప్‌లు

143 మెగావాట్లకుపైగా ఉత్పత్తి  అవసరాలు పోను.. మిగతాది అమ్మకం..

ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహం

ఒక్కసారి బిగిస్తే 25 ఏళ్లపాటు వినియోగం 

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ వినియోగం విషయంలో గ్రేటర్‌ వైఖరి మారుతోంది. ఇప్పటివరకు ప్రభుత్వ పంపిణీ సంస్థలపై ఆధారపడ్డ గేటెడ్‌ కమ్యూనిటీలు, విల్లాలు, టౌన్‌షిప్‌లు.. సొంత ఉత్పత్తిపై దృష్టి సారించాయి. భవనాలపై సోలార్‌ రూఫ్‌ టాప్‌ ఫలకాలను ఏర్పాటు చేసుకుని అవసరాలకు సరిపడా సొంతంగా విద్యుత్‌ తయారుచేసుకుంటున్నాయి. అంతేకాకుండా మిగులు విద్యుత్‌ను పంపిణీ సంస్థలకు సరఫరా చేసి.. నెలవారీ బిల్లులను సగానికిపైగా తగ్గించుకుంటున్నాయి.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 9,515 సోలార్‌ నెట్‌ మీటరింగ్‌ కనెక్షన్ల నుంచి 212 మెగావాట్లకుపైగా విద్యుత్‌ ఉత్పత్తి అవుతుండగా.. గ్రేటర్‌ పరిధిలోని 8,309 సోలార్‌ మీటరింగ్‌లో అత్యధికంగా 143.3 మెగావాట్ల విద్యుత్‌ గ్రేటర్‌లోనే ఉత్పత్తి అవుతోంది. సంప్రదాయ విద్యుత్‌ ఉత్పత్తికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తుండటం, ఒకసారి ఫలకాలు ఏర్పాటు చేసుకుంటే.. 25 ఏళ్ల పాటు కరెంట్‌కు ఢోకా లేకపోవడంతో ఇళ్ల యజమానులు దీనిపై దృష్టి సారించారు.

ప్రత్యక్షంగా నెలవారీ బిల్లులను తగ్గించుకోవడమే కాకుండా.. సంస్థపై విద్యుత్‌ కొనుగోళ్ల భారాన్ని కూడా తగ్గిస్తున్నారు. సోలార్‌ ప్యానెళ్లకు తయారీ కంపెనీ పదేళ్ల గ్యారంటీ ఇస్తోంది. ఆ తర్వాత వార్షిక నిర్వహణ ఒప్పందానికి అవకాశం ఉంది. సాంకేతిక సమస్యలు తతెత్తితే.. టీఎస్‌రెడ్‌కోలో కానీ, ఇంటిగ్రేటెడ్‌ సెంటర్‌లో కానీ ఫిర్యాదు చేస్తే.. నిపుణులు వచ్చి సమస్యను పరిష్కరిస్తారు.

మచ్చుకు కొన్ని
►బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఓ బహుళ అంతస్తుల నివాస సముదాయంలో 518 కుటుం బాలు నివసిస్తున్నాయి. వ్యక్తిగత, ఉమ్మడి అవసరాలకు నెలకు రూ.12 నుంచి 14 లక్షల విలువ చేసే కరెంట్‌ వినియోగించేవారు. ఈ ఖర్చును తగ్గించుకునేందుకు యజమానులంతా కలిసి రూ.2.60 కోట్లతో 750 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్‌ రూఫ్‌టాప్‌ పలకలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం నెలకు 85 వేల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. ఫలితంగా నెలవారీ విద్యుత్‌ బిల్లు రూ.4 నుంచి 6 లక్షలకు తగ్గింది. 

►నగరంలోని 34 బల్దియా కార్యాలయాలపై రూ.4.5 కోట్ల వ్యయంతో 941 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర ఫలకాలు ఏర్పాటు చేశారు. ఒక్కో సౌర ఫలకం సగటున ఏడాది 1,500 యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ యూనిట్‌కు రూ.9 చెల్లిస్తుంది. తాజా సౌర విద్యుత్‌ ఉత్పత్తితో తన విద్యుత్‌ ఖర్చును ఏడాదికి రూ.1.50 కోట్లకు తగ్గించుకుంది.

►రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్‌ యూనివర్సిటీలోని పరిపాలనా భవనాలు సహా విద్యార్థి వసతి గృహాల వార్షిక కరెంట్‌ బిల్లు రూ.కోటికిపైగా వచ్చేది. సౌర ఫలకాల ఏర్పాటు తర్వాత ఈ బిల్లు రూ.40 లక్షలకు తగ్గింది. 

►శామీర్‌పేట జినోమ్‌ వ్యాలీలో 952, జవహర్‌నగర్‌లో 947, కోకాపేట్‌ ఓపెన్‌ స్పేస్‌లో 100, కిమ్స్‌ రెసిడెన్సీలో 275, హిమాయత్‌సాగర్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ 710 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్‌ ఫలకాలను ఏర్పాటు చేసుకుని విద్యుత్‌ బిల్లులు తగ్గించుకున్నారు. నిథమ్‌ క్యాంపస్‌లో 200 కిలోవాట్ల సామర్థ్యం గల ఫలకాలను బిగించడంతో నెలకు రూ. 2.5 లక్షల బిల్లు ఆదా అవుతోంది. 

ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది 
ఒకసారి ఇంటిపై ప్లాంటు ఏర్పాటు చేసుకుంటే 25 ఏళ్లపాటు విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుంది. సాధారణ విద్యుత్‌ కనెక్షన్‌తో పోలిస్తే.. సోలార్‌ ఫలకాలు కొంత ఖర్చుతో కూడింది. ఒకసారి పెట్టుబడి పెడితే ఎక్కువ కాలం లబ్ధి చేకూరే అవకాశం ఉండటంతో వినియోగదారులు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం ఔత్సాహికులకు ఒకటి నుంచి 3 కిలోవాట్లకు 40 శాతం, 3 నుంచి 500 కిలోవాట్ల వరకు 20 శాతం సబ్సిడీ ఇస్తోంది.
 – రఘుమారెడ్డి, సీఎండీ, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ 

బిల్లు రూ.6 లక్షలకు తగ్గింది
మా గేటెడ్‌కమ్యూనిటీలో 10 బహుళ అంతస్తుల భవనాలు ఉన్నాయి. వీటికి గతంలో నెలకు రూ.14 లక్షల వరకు కరెంట్‌ బిల్లు వచ్చేది. 2019 జూలైలో రూ.2.6 కోట్లతో సోలార్‌ రూప్‌టాప్‌ ఫలకాలు ఏర్పాటు చేశాం. దీంతో నెలవారీ కరెంట్‌ బిల్లు రూ.6 లక్షలకు పడిపోయింది. వేసవికాలంలో ఉత్పత్తి ఎక్కువగా వస్తోంది. తమ అవసరాలు తీరగా.. మిగిలిన విద్యుత్‌ను పంపిణీ సంస్థకు విక్రయిస్తున్నాం.     
– కె.యాదగిరిరెడ్డి, అధ్యక్షుడు, గిరిధారి ఎగ్జిక్యూటివ్‌ పార్క్‌ 

(చదవండి: తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ? )

మరిన్ని వార్తలు